
హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): జాతీయ లోక్ అదాలత్లో భాగంగా ఈ నెల 3 నుంచి 12 వరకు రాష్ట్రంలో నిర్వహించిన లోక్ అదాలత్లో మొత్తం 1,51,164 కేసులు పరిష్కారమయ్యాయని సీఐడీ డీజీ చారుసిన్హా వెల్లడించారు. వీటిలో మోటర్ వాహన చట్టం కింద నమోదైన 62,969 కేసులు, 61,052 పెట్టీ కేసులు, 3,896 సైబర్ క్రైమ్ కేసులు, 1,404 డిజాస్టర్ మేనేజ్మెంట్ కేసులు ఉన్నాయని తెలిపారు. మరో 21,843 కేసులు రాజీ అయ్యాయని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సైబర్ నేరాల బాధితులకు రూ.42.28 కోట్లు రీఫండ్ చేసేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు 73,204 మంది బాధితులకు రూ. 514.93 కోట్లు రీఫండ్ చేశామని వెల్లడించారు. ఇందులో ఈ ఏడాది 24,189 మంది బాధితులకు రూ.139.68 కోట్లు రీఫండ్ చేశామని వివరించారు.




