
హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానల్లో అత్యాధునిక రోబోటిక్ సర్జరీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఆదివారం సనత్‌నగర్ టిమ్స్‌లో రాష్ట్రస్థాయి మల్టీస్పెషాలిటీ రోబోటిక్ సర్జరీ వర్‌షాప్ ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన మెడికల్ రోబోటిక్ ఎక్విప్మెంట్, మౌలిక వసతుల ను పరిశీలించారు. వైద్య రంగంలో రోబోటిక్ సర్జరీ సేవలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ.. రాష్ట్రంలో ఆధునిక వైద్యసేవల విస్తరణకు ప్రభు త్వం ప్రాధాన్యమిస్తున్నట్టు తెలిపారు. వైద్యరంగంలో బ్రాండ్‌గా విస్తరించేందుకు టిమ్స్, కొత్తగా ఉస్మానియా దవాఖానలు నిర్మిస్తున్నామని, మెడికల్ కాలేజీలను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. రోబోటిక్ సర్జరీ పితామహుడు డా.సుధీర్ శ్రీవాత్సవ సేవలను ఉపయోగించుకుంటున్నామని తెలిపారు. ‘రాష్ట్రంలోని ఎంఎన్‌జే, టిమ్స్‌లు, ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖానలతోపాటు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని జీజీహెచ్‌లలో అడ్వాన్స్డ్ రోబోటిక్ సర్జరీ సేవలను విస్తరించేందుకు కృషిచేస్తున్నామని చెప్పారు.





