
ఎయిర్‌ బ్యాగులు తెరచుకున్నా దక్కని యువతుల ప్రాణాలు ప్రమాద తీవ్రతకు విరిగిన కారు వెనుక డోరు బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడే: మండలంలోని రోటరీపురంలో 15న జరిగిన రోడ్డు ప్రమాదానికి అతివేగమే ప్రధాన కారణమని బుక్కరాయసముద్రం పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వేకువజామున 4 గంటల సమయంలో కొర్రపాడు నుంచి కారును చోదకుడు శ్రీధర్‌రెడ్డి 120 కిలోమీటర్ల వేగంతో నడుపుకొంటూ రోటరీపురంలోకి దూసుకొచ్చాడు. ఆ సమయంలో కారు ముందు భాగంలో అతడితో పాటు కుమార్‌ ఉండగా, వెనుక సీట్లో హరిత, నవనీత కూర్చున్నారు. వాహనం గ్రామంలోకి ప్రవేశించిన తర్వాత ఎడమ నుంచి కుడి వైపునకు ఉన్న మలుపును శ్రీధర్‌రెడ్డి గమనించాడు. కారు వేగాన్ని అదుపుచేయలేక నేరుగా రోడ్డు పక్కనున్న హోటల్‌లోకి దూసుకెళ్లాడు. వాహనం ఎడమవైపు భాగం హోటల్‌ ముందున్న ఇనుప రాడ్డును బలంగా ఢీకొట్టడంతో వెనుక డోర్‌ విరిగి తెరచుకుంది. కారులో ఉన్న ఎనిమిది ఎయిర్‌బ్యాగులు తెరచుకున్నా, వెనుక కూర్చున్న యువతులు బయటకు ఎగిరిపడటంతో తీవ్ర గాయాలపాలై మృతి చెందారు. ముందు కూర్చున్న ఇద్దరు యువకులకు ఎయిర్‌ బ్యాగులు రక్షణగా నిలవడంతో స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదం జరగడానికి ముందు యువతీ, యువకులు అర్ధరాత్రి సమయంలో కారు ఓపెన్‌ టాప్‌పై కేకలు వేసుకుంటూ వెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. యువతుల పోస్టుమార్టం నివేదిక రావడానికి ఇంకా రెండు రోజులు పట్టవచ్చని పోలీసు అధికారులు వెల్లడించారు. నివేదికతో కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని, అర్ధరాత్రి వేళ యువతులతో కొర్రపాడు వైపు ఎందుకు వెళ్లారో యువకులను విచారిస్తే తెలుస్తుందన్నారు. వారు కోలుకున్నాక అదుపులోకి తీసుకుని విచారిస్తామని పోలీసులు వివరించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.