ఇంటర్నెట్‌ డెస్క్‌: కర్ణాటకలోని బాగల్‌కోట్‌(Bagalkot)లో ఓ వైద్యురాలిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఎమ్మెల్యే ఉమేశ్‌ మెటీ (MLA Umesh Meti) మేనకోడలైన డా.అంకిత యారగల్‌ నమ్మ క్లినిక్‌లో వైద్యాధికారిగా పనిచేస్తూ.. విధులకు హాజరుకాకుండానే నెలకు రూ.70 వేలకు పైగా జీతం తీసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. అదే సమయంలో ఓ ప్రైవేటు వైద్య కళాశాలలో ఆమె పీజీ (postgraduate) చదువుతున్నట్లు గుర్తించి నోటీసులు జారీ చేశారు. మార్చి 3 నుంచి ఇప్పటివరకు క్లినిక్‌కు ఆమె హాజరుకాలేదని అధికారులు పేర్కొన్నారు. దీంతో వైద్యురాలు లేకుండానే క్లినిక్‌ ఎలా నడిపించారనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై జిల్లా పంచాయతీ సీఈవో గజానన్‌ బాలే విచారణకు ఆదేశించారు. తొలుత జరిగిన విచారణకు అంకిత హాజరుకాకపోవడంతో.. సెప్టెంబరు 18న జరిగే విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఆరోపణలు రుజువైతే క్రమశిక్షణ చర్యలతో పాటు కర్ణాటక మెడికల్‌ కౌన్సిల్‌(KMC), జాతీయ వైద్య కమిషన్‌(NMC)కు ఈ విషయాన్ని తెలపనున్నట్లు అధికారులు చెప్పారు. విధులకు హాజరుకాని కాలంలో చెల్లించిన జీతాన్ని కూడా తిరిగి వసూలు చేసే అవకాశం ఉందన్నారు. కాగా, ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే ఉమేశ్‌ మెటీ, అంకిత ఇప్పటివరకు స్పందించలేదు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.