
Rajahmundry: వైశ్య సంఘాలు రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని, వాటిపై రాజకీయ జోక్యం లేకుండా చూడాలని వైశ్య సంఘాల ప్రతినిధులు కోరారు. తమ సంఘీయులు అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నారని, అయితే సంఘాల విషయానికి వచ్చేసరికి పార్టీలతో సంబంధం లేకుండా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని తెలిపారు. సేవా సంస్థలపై రాజకీయ నీడలు పడకుండా మీడియా, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం లాలాచెరువు రోడ్డులోని వైశ్య హాస్టల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కోట్ల కనకేశ్వరరావు, మద్దుల మురళీకృష్ణ, పందిరి వీరభద్రస్వామి, ఇన్నమూరి శ్రీరామచంద్రమూర్తి, ఇన్నమూరి దీపు తదితరులు మాట్లాడారు. ఇటీవల వైఎంవిఏ హాలుకు లిఫ్ట్ ఏర్పాటు చేసే విషయంలో వస్తున్న వార్తలపై వారు వివరణ ఇచ్చారు. సేవే ప్రధాన లక్ష్యం కోట్ల కనకేశ్వరరావు మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో ఎన్ని వైశ్య సంఘాలు ఉన్నప్పటికీ అందరి ప్రధాన లక్ష్యం సేవాభావమేనని తెలిపారు. సంఘాల్లో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన వారు సభ్యులుగా ఉన్నప్పటికీ పార్టీలు, రాజకీయాలకు ఎప్పుడూ ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు. విద్యార్థులకు విద్య, వసతి వంటి సేవలను అందిస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. వైశ్య సంఘాల ఆధ్వర్యంలోని విద్యా సంస్థల్లో వందలాది మంది విద్యార్థులు వసతి పొందుతూ మంచి ఉత్తీర్ణత సాధిస్తున్నారని తెలిపారు. సేవా సంస్థల్లో రాజకీయ జోక్యం వల్ల సభ్యులకు ఇబ్బందులు ఎదురవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైశ్య సంస్థలపై రాజకీయ నీడలు పడకుండా మీడియా, ప్రజలు సహకరించాలని కోరారు.లిఫ్ట్ నిర్మాణానికి ప్రభుత్వ నిధులు తీసుకోలేదు మద్దుల మురళీకృష్ణ మాట్లాడుతూ వైఎంవిఏ హాలును తక్కువ ఖర్చుతో పెళ్లిళ్లు, ఇతర వేడుకలకు అందుబాటులో ఉంచుతున్నామని, ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు. వైఎంవిఏ హాలు పక్కన ఉన్న చిన్న స్థలంలో వ్యాయామ కళాశాల ఉన్నప్పటికీ గత 15 ఏళ్లుగా అక్కడ ఎలాంటి కార్యకలాపాలు జరగడం లేదన్నారు. ఇటీవల వైఎంవిఏ హాలుకు లిఫ్ట్ ఏర్పాటు చేయాలని భావించి, ఖాళీ స్థలానికి కొంత పరిహారం కూడా ఇచ్చామని తెలిపారు. లిఫ్ట్ నిర్మాణానికి ప్రభుత్వ నిధులు తీసుకోలేదని, ఎవరి నుంచి విరాళాలు కూడా అడగలేదని స్పష్టం చేశారు. వైశ్య సంఘానికి చెందిన వారి సహకారంతో సొంత నిధులతోనే లిఫ్ట్ నిర్మిస్తున్నామని వెల్లడించారు. ప్రజలకు ఉపయోగపడే సదుపాయం కల్పిస్తుంటే కొంతమంది నాయకులు అడ్డుకోవడం సరికాదన్నారు. అయితే ఈ స్థలం తమదంటే తమదని వివిధ వర్గాలుగా విడిపోయి కొందరు ముందుకు రావడంతో గందరగోళం నెలకొందని, దీంతో రాజకీయ నాయకుల జోక్యం ఏర్పడుతోందని విచారం వ్యక్తం చేశారు. ఈ స్థలం, లిఫ్ట్ నిర్మాణం విషయంలో పూర్తి సమాచారం లేకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని అన్నారు. సేవా సంస్థల విషయంలో వివాదాలు సృష్టించవద్దని కోరారు. తమపై ఒత్తిళ్లు, అడ్డంకులు కొనసాగితే వైశ్య సంఘాలన్నీ సంఘటితంగా ఎదుర్కొంటాయని, అవసరమైతే దీక్షలకు కూడా సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు. లిఫ్ట్ తమ వ్యక్తిగత ప్రయోజనం కోసం కాదని, వైఎంవిఏకు వచ్చే ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే ప్రజా సౌకర్యమని తెలిపారు. స్థలంపై మున్సిపల్ కార్పొరేషన్ తేల్చాలి పందిరి వీరభద్రస్వామి మాట్లాడుతూ వైఎంవిఏ తరఫున వృద్ధులకు పెన్షన్లు అందించడం, వైద్య సేవలు కల్పించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. హాలు పక్కన ఉన్న స్థలం కన్సర్వెన్సీ కిందకు వస్తుందని, అక్కడ గత 15 ఏళ్లుగా ఎలాంటి కార్యకలాపాలు జరగడం లేదన్నారు. వైఎంవిఏ హాలుకు లిఫ్ట్ నిర్మిస్తే బాగుంటుందని భావించి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుంటే లేనిపోని వివాదాలు రావడం బాధాకరమన్నారు. స్థలం తమదంటే తమదని ఎవరెవరు వచ్చినా, అది ఎవరి స్థలమో మున్సిపల్ కార్పొరేషనే తేల్చాల్సి ఉందన్నారు. ఒకవేళ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఏదైనా చెల్లించాల్సి వస్తే చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ వ్యవహారంలో రాజకీయ జోక్యం ఉండకూడదని స్పష్టం చేశారు. అనవసరంగా రాజకీయాల్లోకి లాగొద్దు ఇన్నమూరి శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ వైఎంవిఏ హాలు ఎన్నో ఏళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని గుర్తుచేశారు. తన చిన్నతనం నుంచే ఈ ప్రాంతంతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేశారు. లిఫ్ట్ నిర్మించాలనుకుంటున్న స్థలం కన్సర్వెన్సీ లైన్ కిందకు వస్తుందని భావిస్తున్నామని, అవసరమైతే మున్సిపల్ కార్పొరేషన్‌కు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లిస్తామని తెలిపారు. ఈ వ్యవహారాన్ని అనవసరంగా రాజకీయాల్లోకి లాగవద్దని కోరారు. మధ్యలో మార్గాని భరత్ జోక్యం ఎందుకు? ఇన్నమూరి దీపు మాట్లాడుతూ వైశ్య సంస్థలు, వైశ్యులపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నామని తెలిపారు. దాతలు అందించిన సహకారంతో వైఎంవిఏ సంస్థ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని వివరించారు. వైఎంవిఏకు అనుబంధంగా ఉన్న స్థలానికి సంబంధించి కొంతకాలంగా వివాదం కొనసాగుతోందని, అయితే తాము ఎలాంటి అక్రమ ఆక్రమణలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. వైఎంవిఏ హాలుకు వచ్చే వృద్ధులు, ఇతరులు మెట్లు ఎక్కి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో లిఫ్ట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. అయితే లిఫ్ట్ నిర్మాణాన్ని కొందరు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో మాజీ ఎంపీ మార్గాని భరత్ జోక్యం ఎందుకని ప్రశ్నించారు. వైశ్యులను, వైశ్య సంఘాలను టార్గెట్ చేసి దాడి చేయడం తగదన్నారు. వైశ్య సంఘాలు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలని, సేవా సంస్థల విషయంలో రాజకీయ వివాదాలు సృష్టించకుండా చూడాలని వైశ్య సంఘాల ప్రతినిధులు మరోసారి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు వైశ్య సంఘాల ప్రతినిధులు సమాధానాలు ఇచ్చారు. పెంటపాటి సుభాష్, కక్కిరాల బుచ్చిరాజు, పులవర్తి లక్ష్మణస్వామి, మైలవరపు నాగేంద్ర ప్రసాద్, ప్రభాత్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.





