
న్యూఢిల్లీ: ఒమన్ తీరంలో ఆదివారం వాణిజ్య నౌక ఎంటీఎల్ గయాపై జరిగిన దాడిని భారత విదేశాంగశాఖ(ఎంఈఏ) ఖండించింది. నౌకలో 14 మంది భారతీయులు ఉండగా, వారిలో 13 మందిని ఒమన్ అధికారులు రక్షించారు. ఒకరు గల్లంతయ్యారు. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఒమన్లోని భారత రాయబార కార్యాలయం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నదని ఎంఈఏ తెలిపింది. అలాగే భారతీయులను రక్షించినందుకు ఒమన్ అధికారులకు కృతజతలు తెలిపింది. కాగా ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలు, నౌకా సిబ్బంది, పౌరులు, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం ఆమోదయోగ్యం కాదని భారతదేశం స్పష్టం చేసింది.




