

- కారు డ్రైవర్‌కు హెల్మెట్ చలాన్.. నోటీసు చూసి షాక్
- AI కెమెరా పొరపాటు.. కారు డ్రైవర్‌కు రూ.500 జరిమానా
- బైకు కాదు.. కారుకే హెల్మెట్ ఫైన్ అసలేం జరిగిందంటే?
AI Camera Blunder : ఇకపై బైకు నడిపేవాళ్లే కాదు.. కారు నడిపేవాళ్లు కూడా హెల్మెట్ పెట్టుకోవాల్సిందే.. లేదంటే ఫైన్ పడుద్ది.. అదేంటీ కారుకు హెల్మెట్ ఏంటి? అంటారా? అవును.. ఏఐ కెమెరా ట్రాఫిక్ రూల్ ప్రకారం.. కారు నడిపినా ఇకపై ఫైన్ కట్టాల్సిందే..
ఈ వింత ఘటన కర్ణాటకలోని బెళగావి జిల్లా అథణి పట్టణంలో జరిగింది. ఏఐ కెమెరా చేసిన పొరపాటు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కారు నడుపుతున్న వ్యక్తి హెల్మెట్ ధరించలేదంటూ ట్రాఫిక్ పోలీసులు రూ.500 జరిమానా విధించిన ఘటన స్థానికంగా వైరల్‌గా మారింది.
అథణి పట్టణానికి చెందిన సుభాష్ అనే వ్యక్తి కారులో ప్రయాణిస్తుండగా అంబేడ్కర్ కూడలిలో చలాన్ పడింది. అక్కడి ట్రాఫిక్ ఏఐ కెమెరా ఆయన వాహనాన్ని క్యాప్చర్ చేసింది. అనంతరం ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా హెల్మెట్ ధరించలేదంటూ ఆయన వాట్సప్ నంబర్‌కు చలాన్ పంపించింది. ఆ జరిమానా మొత్తం రూ.500గా కట్టాలని ఉంది.
Read Also : RBI Rate Hike : రెపో రేటుపై ఉత్కంఠ.. లోన్ తీసుకున్నారా? EMI షాక్ తప్పదా.. FD పెట్టుబడిదారులకు జాక్‌పాట్!
హెల్మెట్ తోనే పోలీసు స్టేషన్‌కు :
చలాన్ చూసిన సుభాష్ ఒక్కసారిగా అవాక్కయ్యారు. కారు నడిపితే హెల్మెట్ జరిమానా విధించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వెంటనే హెల్మెట్ ధరించి కారును నడుపుకుంటూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. కారులో ప్రయాణించే సమయంలో కూడా హెల్మెట్ తప్పనిసరా? అంటూ పోలీసులను ప్రశ్నించారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కూడా ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేయగా ఇప్పుడు అది వైరల్‌గా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు చలాన్‌ను పరిశీలించి, ఏఐ కెమెరా ఆటోమేటెడ్ సిస్టమ్ పొరపాటు కారణంగానే ఈ జరిమానా జారీ అయినట్లు గుర్తించారు. అనంతరం సుభాష్‌కు విధించిన రూ.500 జరిమానాను క్యాన్సిల్ చేశారు.
సాధారణంగా హెల్మెట్ నిబంధన ఉల్లంఘనపై టూవీలర్ వాహనదారులకు జరిమానాలు విధిస్తుంటారు. అయితే, కారుకు సంబంధించిన నంబర్‌ను గుర్తించిన ఏఐ వ్యవస్థ హెల్మెట్ నిబంధనను తప్పుగా వర్తింపజేయడం ఇప్పుడు చర్చకు దారితీసింది.




