
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Raidurg land auction: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ సరికొత్త చరిత్రను తిరగరాసింది. తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) తాజాగా నిర్వహించిన ఆన్లైన్ ఈ-వేలంలో రాయదుర్గం ఐటీ కారిడార్‌లోని స్థలాలు ఊహించని రీతిలో రికార్డు ధరలను పలికాయి. ఈ వేలంలో రాయదుర్గం పరిధిలోని P1 ప్లాట్ ఎకరం ఏకంగా రూ. 264 కోట్లకు అమ్ముడుపోయి, హైదరాబాద్ నగర రియల్ ఎస్టేట్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన భూమిగా ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పింది.
ఈ చారిత్రాత్మక వేలంలో 'P1' ప్లాట్ మొత్తం విస్తీర్ణం 5.25 ఎకరాలు. ఎకరాకు రూ. 264 కోట్ల బిడ్ లెక్కన ఈ ఒక్క ప్లాట్ అమ్మకంతోనే తెలంగాణ ప్రభుత్వ ఖజానాకు రూ. 1,386 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. ప్రభుత్వం నిర్ణయించిన ప్రాథమిక కనీస ధర కంటే ఇది చాలా రెట్లు ఎక్కువ. దేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ దిగ్గజాల మధ్య సాగిన తీవ్ర పోటీని తట్టుకుని 'MSN రియాల్టీస్' సంస్థ ఈ ప్రైమ్ ప్లాట్‌ను దక్కించుకుంది. ఈ కొత్త బెంచ్‌మార్క్ ధరతో గతంలో నమోదైన రికార్డులన్నీ బద్దలయ్యాయి. 2022లో హెచ్ఎమ్డీఏ నిర్వహించిన వేలంలో ఎకరం రూ. 100 కోట్లు పలికి సంచలనం సృష్టించింది. 2025 అక్టోబర్ రాయదుర్గంలో ఎకరం రూ. 177 కోట్లుగా నమోదై అప్పటికి రికార్డుగా నిలిచింది.ప్రస్తుతం ఏకంగా రూ. 264 కోట్లకు చేరుకుని, కోకాపేటను అధిగమించి రాయదుర్గం నగరంలోనే నంబర్ 1 ఖరీదైన ప్రాంతంగా అవతరించింది.
హైదరాబాద్‌లోని అత్యంత కీలకమైన 'నాలెడ్జ్ సిటీ' పరిధిలో ఈ ప్లాట్ ఉండటమే ఈ స్థాయి ధర రావడానికి ప్రధాన కారణం. టీ-హబ్, మై హోమ్ భూజా, ఐటీసీ కోహినూర్ వంటి ప్రముఖ మైలురాళ్లకు ఇది అత్యంత సమీపంలో ఉంది. ఈ స్థలానికి రెండు వైపులా 45 మీటర్ల వెడల్పాటి రోడ్లు, శంషాబాద్ విమానాశ్రయం.. హైటెక్ సిటీలకు మెరుగైన రవాణా వ్యవస్థ, మెట్రో కనెక్టివిటీ ఉండటం విశేషం. అంతేకాకుండా, రాయదుర్గంలో ఉన్న మొత్తం 439 ఎకరాల లేఅవుట్లో ప్రస్తుతం వేలానికి కేవలం 10 ఎకరాలు మాత్రమే మిగిలి ఉండటంతో కొనుగోలుదారుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. MSTC పోర్టల్ ద్వారా ఆన్లైన్ పద్ధతిలో ఈ వేలం పూర్తి పారదర్శకంగా జరిగింది. ఈ ప్రక్రియకు అంతర్జాతీయ ప్రముఖ సంస్థ JLL సలహాదారుగా వ్యవహరించింది. ఈ వేలానికి ముందే TGIIC అధికారులు బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో రోడ్ షోలు నిర్వహించి జాతీయ స్థాయి బిల్డర్లను ఆహ్వానించడం విశేష స్పందనకు దోహదపడింది.
కేవలం 2 చదరపు కిలోమీటర్ల పరిధిలోనే ఉన్న రాయదుర్గం ప్రాంతం ద్వారా గత 8 నెలల కాలంలోనే ప్రభుత్వానికి రూ. 5,000 కోట్లకు పైగా రాబడి రావడం విశేషం. ఈ స్థలంలో MSN రియాల్టీస్ సంస్థ భారీ ఐటీ టవర్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లను నిర్మించనుంది. దీనివల్ల రాబోయే రోజుల్లో వేలాది మందికి కొత్తగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. హైదరాబాద్‌లో ఐటీ రంగానికి ఉన్న స్థిరత్వం, వ్యాపార అనుకూల వాతావరణం కారణంగానే ఈ స్థాయి ధరలు సాధ్యమయ్యాయని, ఈ డీల్‌తో హైదరాబాద్ నగర స్థాయి ముంబై, బెంగళూరు నగరాల సరసన నిలిచిందని రియల్ ఎస్టేట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.




