
ఇంటర్నెట్‌ డెస్క్‌: మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది, జైషే మహ్మద్‌ ఉగ్ర ముఠా అధినేత మసూద్‌ అజార్‌ (Masood Azhar) పాకిస్థాన్‌ ( Pakistan )లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడని భారత్‌ ఎన్నిసార్లు చెబుతున్నా.. ఇస్లామాబాద్‌ మాత్రం దాన్ని అంగీకరించట్లేదు. అతడు పాక్‌లో లేడని ప్రపంచాన్ని నమ్మించేందుకు తాజాగా మరో ప్రకటన చేసింది. ఆ దేశ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA) తన ‘మోస్ట్ వాంటెడ్’ ఉగ్రవాదుల ‘రెడ్ బుక్’లో మసూద్‌ పేరును చేర్చింది. అతడి ఆచూకీ తెలిపిన వారికి 70 లక్షల పాకిస్థానీ రూపాయలు (PKR) బహుమతిగా ప్రకటించింది. కాగా, అతడిని పట్టిస్తే 50 లక్షల పాకిస్థానీ రూపాయలు ఇస్తామని ఐదేళ్ల క్రితమే ప్రకటించింది. ప్రస్తుతం దానికి మరో 20 లక్షలు చేర్చి.. తాజాగా మరోసారి ప్రకటన చేసింది. అక్టోబర్‌లో జరగనున్న ఆర్థిక చర్యల కార్యదళం (ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్-FATF) సర్వసభ్య సమావేశానికి ముందు పాకిస్థాన్‌ ఈ తరహా ప్రకటన చేయడం గమనార్హం. ఉగ్రవాదులపై పాకిస్థాన్‌ చర్యలు తీసుకుంటోందనే అభిప్రాయాన్ని ప్రపంచ దేశాల్లో కలిగించి.. అంతర్జాతీయ స్థాయిలో ఎదురయ్యే ఒత్తిళ్ల నుంచి తప్పించుకొనేందుకే ఆ దేశం ఈ ప్రకటన చేసి ఉండొచ్చని భారత నిఘా వర్గాలు భావిస్తున్నాయి. మసూద్‌ అజార్‌ అఫ్గానిస్థాన్‌ ( Afghanistan )లో తలదాచుకున్నాడని 2021 నుంచి పాక్‌ చెబుతూ వస్తోంది. ఆ ఆరోపణలను అఫ్గాన్‌ కొట్టిపడేసింది. అయితే, అతడు పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో ఉన్న నవాబ్‌షాలో ఉన్నట్లు భారత నిఘా సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలోనే పాక్‌ తాజా ప్రకటన చేయడం గమనార్హం. ఎఫ్‌ఐఏ రెడ్ బుక్‌లో 26/11 ముంబయి ఉగ్రవాద దాడులతో సంబంధమున్న 19 మంది ఉగ్రవాదుల పేర్లు కూడా ఉన్నాయి. అయితే వారందరూ పాక్‌లోనే దాక్కున్నారని.. అంతర్జాతీయ పరిశీలన నుంచి దృష్టి మళ్లించేందుకే ఇస్లామాబాద్‌ వారిని మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చిందని భారత్‌ వాదిస్తోంది. పాక్‌ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహ్మద్‌ ఉగ్ర ముఠా అధినేత అయిన మసూద్‌.. భారత్‌లో పలు భీకర దాడులకు సూత్రధారి. 1995లో భారత్‌ అతడిని అరెస్టు చేసింది. అయితే, 1999లో కొందరు ఉగ్రవాదులు విమానాన్ని హైజాక్‌ చేసి అతడిని విడిపించుకున్నారు. ఆ తర్వాత అతడు జైషేను స్థాపించాడు. 2001లో పార్లమెంట్‌పై జరిగిన ఉగ్రదాడి, 2008లో ముంబయిలో జరిగిన బాంబు పేలుళ్లలోనూ ఇతడి ప్రమేయం ఉంది. 2019లో మసూద్‌ను ఐరాస అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





