
ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (fatf) యొక్క తదుపరి ప్లీనరీ సమావేశానికి ముందు పాకిస్థాన్ మరోసారి కొత్త కుట్రకు తెరలేపిందా? అంతర్జాతీయ సమాజం దృష్టిని మరల్చే ప్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) యొక్క తదుపరి ప్లీనరీ సమావేశానికి ముందు పాకిస్థాన్ మరోసారి కొత్త కుట్రకు తెరలేపిందా? అంతర్జాతీయ సమాజం దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తుందా? ఈ ప్రశ్నలకు అవును అనే సమాధానం వినిపిస్తోంది. జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ సహా పలువురు ఉగ్రవాదుల పేర్లను పాకిస్థాన్ 2026 మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో చేర్చడం చర్చనీయాంశంగా మారింది. అక్టోబరులో జరగనున్న ఎఫ్ఏటీఎఫ్ సమీక్షకు (రివ్యూ) ముందు పాకిస్థాన్ కొత్త కుట్ర చేస్తోందని భారత వర్గాలు ఆరోపిస్తున్నాయి. గతంలో ఉగ్రవాద సంస్థలకు నిధుల సరఫరాను అడ్డుకోవడంలో, అరికట్టడంలో పాకిస్థాన్ విఫలం కావడంతో ఆ దేశం 2018-2022 మధ్య FATF గ్రే లిస్టులోనే ఉంది. ఇప్పుడు మరోసారి అదే గతి పడుతుందన్న భయంతోనే ఇలా చేస్తున్నట్లు సమాచారం. పాకిస్థాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA) ఇటీవల విడుదల చేసిన 'రెడ్ బుక్'లో మసూద్ అజర్ పేరును చేర్చింది. ఈ సందర్భంగా అతడిపై గతంలో ప్రకటించిన రివార్డును కూడా పాకిస్థాన్ కరెన్సీలో రూ. 50 లక్షల నుంచి ఇప్పుడు రూ. 70 లక్షలకు పెంచింది. అయితే ఇది ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు పాకిస్థాన్ తీసుకున్న నిజమైన చర్య కాదని, ఇది తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న ప్రయత్నమేనని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఇంకా ఈ రెడ్‌బుక్ ప్రకారం పాకిస్థాన్‌లో అధికారికంగానే టెర్రరిస్టుల సంఖ్య భారీగా పెరిగింది. 2021 రెడ్‌బుక్ కింద 1330 మంది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల పేర్లు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 35 శాతం పెరిగి 1804 కు చేరింది. అసలు అజర్ ఎక్కడ ఉన్నాడు? మసూద్ అజర్ 2021 నుంచే పాకిస్థాన్‌లో లేడని, అఫ్గానిస్థాన్ పారిపోయాడని వాదిస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే గత 6 నెలల్లో భారత నిఘా సంస్థలు విశ్లేషించిన దాని ప్రకారం చూస్తే అజర్ పాకిస్థాన్ సింధ్ ప్రావిన్స్‌లోని నవాబ్షా నగరంలోనే దాక్కున్నట్లు గుర్తించినట్లు సమాచారం. ఇక భారత్‌లో జరిగిన ఎన్నో ఉగ్రదాడుల వెనుక మసూద్ అజర్ మాస్టర్‌మైండ్‌గా ఉన్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడితో అతని సంస్థకు సంబంధం ఉన్నట్లు భారత్ ప్రభుత్వం ఆరోపించింది. ఈ క్రమంలో FIA లేటెస్ట్ రెడ్‌బుక్‌లో 2008 ముంబయి 26/11 ఉగ్రదాడులకు సహకరించిన లేదా ఆర్థికంగా మద్దతు అందించిన సుమారు 19 మంది ఉగ్రవాదుల పేర్లు ఉన్నట్లు తెలిసింది. వారిలో 17 మంది ఫొటోలు, 26/11 దాడిలో వారి పాత్ర, లష్కరే తోయిబాతో సంబంధాలు వంటి వివరాలు ఈ జాబితాలో ఉన్నాయి.





