
నరుడి కన్ను పడితే నల్లరాయి కూడా పగులుతుందని నరదిష్టి గురించి చెబుతుంటారు. మానవుల మధ్య ఏర్పడే ఈర్ష్య, అసూయలే ‘నరదిష్టి’ లేదా ‘దృష్టి దోషం’ ( Drishti Dosha) అని పిలుస్తారు. ఈ విధమైన చెడు శక్తులను, పీడలను సమూలంగా నాశనం చేసి, గృహాలు, వ్యాపారాలు, సమాజానికి సుఖశాంతులను అందించే దైవస్వరూపమే ‘కళ్ల దిష్టి గణపతి’ లేదా ‘శుభదృష్టి గణపతి’ (Drishti Ganapathi). ఈ వినాయకచవితి సందర్భంగా కళ్ల దిష్టి గణపతి విశేషాలు.. ప్రాచీన కాలంలో మానవుల ప్రతికూల ఆలోచనలు, అసూయాద్వేషాల నుంచి ‘దిష్టి రాక్షసుడు’ అనే అశుభ శక్తి ఉద్భవించింది. ఈ శక్తి వల్ల గృహాల్లో అశాంతి, ఐశ్వర్య హాని, వ్యాధులు, కార్యవిఘ్నాలు సంభవించడం ప్రారంభమైంది. దీంతో లోక కళ్యాణార్థం సప్తర్షులలో శ్రేష్ఠుడైన అగస్త్య మహాముని మహా గణపతి కోసం ఘోర తపస్సు ఆచరించారు. విఘ్నేశ్వరుడు తన సాధారణ ప్రశాంత రూపాన్ని విడిచి, విశ్వరూప శక్తితో మహాగణపతి 33వ అవతారంగా ‘శుభదృష్టి గణపతి’గా అవతరించాడు. ఈ ఉగ్ర-వీర రూపంతో అశుభ దృష్టి కలిగించే దిష్టి రాక్షసుడిని సంహరించి లోకానికి శాశ్వత రక్షణ కల్పించాడు. ఈ దివ్య పటాన్ని లేదా విగ్రహాన్ని గృహాలు, కార్యాలయాలు, పరిశ్రమలు, వ్యాపార సముదాయాల సింహద్వారం పైభాగంలో లేదా లోపలికి ప్రవేశించే వారి దృష్టి నేరుగా పడే విధంగా ఉత్తర దిశ వైపు చూసేలా అమర్చాలి. బయటి వ్యక్తుల చెడు చూపు లేదా నెగెటివ్ ఆలోచనలు ఈ స్వామి పటంపై పడగానే, ఆ దృష్టి దోషాలు సూర్యకాంతికి మంచు కరిగినట్లు తొలగిపోయి, ఆ పరిసర ప్రాంతమంతా ధనాత్మక తరంగాలు ప్రసరిస్తాయని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతుంటారు. (Ideal Placement of Drishti Ganapathi Idol). .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


