
Rajahmundry: రాజమండ్రి: వీధి వ్యాపారులకు 'జోన్ల' భరోసా!
Rajahmundry: నగరంలో ఏ ఒక్క వీధి వ్యాపారికి అన్యాయం జరగకుండా వీధులను జోన్లు వారీగా విభజించినట్లు కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలోని మీటింగ్ హాల్ నందు టౌన్ వెండింగ్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు.
వీధి వ్యాపారస్తుల చట్టం ప్రకారం పట్టణ ప్రణాళిక మరియు మెప్మా సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి రెడ్ జోన్, యాంబర్ జోన్, గ్రీన్ జోన్లను గుర్తించినట్లు చెప్పారు. నగర పరిధిలోగల వీధులన్నీ జోన్లు వారీగా విభజించి నివేదికను సిద్ధం చేసుకున్నట్లు వివరించారు.
విద్యా సంస్థలు, వైద్యశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, జంక్షన్ లు, ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించినట్లు తెలిపారు. నిర్దేశిత సమయాలు, నిర్దేశిత రోజులలో వ్యాపారాలు చేసుకునే ప్రాంతాలను యాంబర్ జోన్లుగా మిగతా ప్రాంతాలను గ్రీన్ జోన్లుగా ప్రకటించటం జరిగిందన్నారు.
మొత్తంగా నగర పరిధిలో 62 గ్రీన్, 26 యాంబర్, 58 రెడ్ జోన్లను గుర్తించినట్లు వెల్లడించారు. రెడ్ జోన్లకు సంబంధించి అభ్యంతరాలు ఉన్నట్లయితే.. అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి తెలియజేయాలని కమిటీ సభ్యులకు సూచించారు.
జోన్ల గుర్తింపు అనంతరం వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులను జారీ చేసి వెండింగ్ జోన్లలో స్థలాలను కేటాయించి తగు మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. వీధి వ్యాపారుల జీవనోపాధికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా, ఒక స్పష్టమైన మరియు యోచనాత్మక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు.
సమీక్షలో అడిషనల్ కమిషనర్ పి.వి.రామలింగేశ్వర్, సిటీ ప్లానర్ జి.వి.ఎస్.ఎన్.మూర్తి, సీఎంఎం రామలక్ష్మి, శానిటరీ సూపర్ వైజర్ శ్రీనివాస్, ట్రాఫిక్ ఎస్సై పి.శ్రీనివాసరావు, టౌన్ వెండింగ్ కమిటీ ప్రెసిడెంట్ సత్యనారాయణ, ఎన్జీఓ రాంబాబు, ఇతర సభ్యులు పాల్గొన్నారు.






