
పెనుబల్లి, కల్లూరు, న్యూస్‌టుడే: కళ్ల ముందే పంట ఎండిపోతుంది.. ప్రాజెక్టులో నీరున్నా మా పొలాలకు వదలడంలేదు. పెట్టుబడులన్నీ పోతే కుటుంబాలను ఎలా పోషించాలి? అంటూ పులిగుండాల ప్రాజెక్టు ఆయకట్టు గిరిజన, దళిత రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. పెనుబల్లి మండలంలోని పులిగుండాల జలాశయాన్ని బ్రహ్మాళకుంట, కల్లూరు మండలం బత్తులపల్లి గిరిజనుల, దళిత భూముల సాగునీటి అవసరాల కోసం 30 ఏళ్ల కిత్రం నిర్మించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 16 అడుగులకు ప్రస్తుతం 11 అడుగులు నీరున్నా సాగుకు నీటిని విడుదల చేయకపోవడంతో వరి పొలాలు బీటలు వారుతున్నాయి. మరికొద్ది రోజులు నీరు అందకుంటే ఆయకట్టులో దాదాపు 450 ఎకరాల పంట చేతికొచ్చే పరిస్థితి లేదని ఆందోళన చెందుతున్నారు. పులిగుండాల అటవీప్రాంతాన్ని ఎకో టూరిజంగా అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో నీటి విడుదలపై అటవీశాఖ అధికారులు, సిబ్బంది నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులు తక్షణమే పరిస్థితిని పరిశీలించి అటవీ, నీటిపారుదల శాఖల అధికారులు సమన్వయంతో పంటలకు నీటిని అందించాలని గిరిజన రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎకరాకు రూ.30వేలు పెట్టుబడి పెట్టాం. ఎకో టూరిజం పేరుతో గిరిజనుల నోటి దగ్గర కూడు లాగేసుకుంటున్నారు. మా గిరిజన, దళితుల కోసం కట్టిన ప్రాజెక్టు నుంచి నీటి విడుదల చేయకపోవడంతో మా పంటలు ఎండిపోతున్నాయి. బానోతు శ్రీను, బ్రహ్మాళకుంట మాకోసం కట్టిన ప్రాజెక్టు నుంచి నీళ్లు అడిగితే అటవీశాఖ అధికారులు కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. ప్రస్తుతం వరి పంటకు నీళ్లు లేక నెర్రెలు బారుతున్నాయి. మా గురించి పట్టించుకునే నాథుడే లేడు. జిల్లా మంత్రులు దృష్టిసారించాలి. భూగర్భ జలాలపై ప్రభావం.. రామారావు, డీఈఈ, పెనుబల్లి పులిగుండాల ప్రాజెక్టుకు అటవీప్రాంతం నుంచే నీరు వస్తుంది. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో మున్ముందు వర్షాలు కురుస్తాయనేది లేదు. నీటిని విడుదల చేస్తే భూగర్భ జలాలపై ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల ఆదేశాలను అమలు చేస్తాం. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





