
టెక్‌ దిగ్గజాల స్పష్టీకరణ వాషింగ్టన్‌: కృత్రిమ మేధ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. రానున్న పదేళ్లలో 10శాతానికిపైగా జనం ఏఐ కారణంగా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని ఆంథ్రోపిక్‌కు చెందిన పరిశోధకుడు ఇవాన్‌ హుబింగర్‌ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా ఆంథ్రోపిక్‌ సీఈవో డారియో అమోడెయ్‌ సైతం కృత్రిమ మేధతో ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. ఈ సాంకేతిక వేగానికి ఇకనైనా కళ్లెం వేయాలని అభిప్రాయపడ్డారు. ఏఐ సామర్థ్యాల పెంపును తగ్గించాలని కంపెనీలను కోరారు. ఓపెన్‌ఏఐ సీఈవో శామ్‌ ఆల్ట్‌మన్, ఎక్స్‌ ఏఐ అధిపతి ఎలాన్‌ మస్క్‌ సైతం డారియో అభిప్రాయానికి మద్దతు పలికారు. స్వయంగా తమ సామర్థ్యాలను మెరుగుపరుచుకునే సూపర్‌ ఇంటెలిజెన్స్‌ వ్యవస్థలను రూపొందిస్తుండటంతో.. తమను తాము మెరుగుపరుచుకునే సామర్థ్యం ఏఐ వ్యవస్థల్లో పెరుగుతోందని డారియో ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో కృత్రిమ మేధకు చెందిన ఏజెంట్లు బాహ్య వ్యవస్థలను యాక్సెస్‌ చేయడానికి ప్రయత్నిస్తున్న విషయాలను గుర్తు చేశారు. ఏఐని ఇలాగే వదిలేస్తే అది త్వరలోనే స్వయంప్రతిపత్తిగల వ్యవస్థలను సృష్టిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మరో 6-12 నెలల్లో ఆ సమూహం మొత్తం ఇంటర్నెట్‌ను స్వాధీనం చేసుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అదే జరిగితే కొన్ని వందల బిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలిపారు. అయితే సాంకేతిక పురోగతిని పూర్తిగా నిలిపివేయాలని తాను చెప్పట్లేదన్నారు. దానికి బదులుగా కంపెనీలు తమ మోడళ్ల భద్రతను మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. కృత్రిమ మేధ వేగానికి బ్రేకులు వేయడానికి మూడు-దశల ప్రణాళికను వివరించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





