
ఇంటర్నెట్‌ డెస్క్: కృత్రిమ మేధ (Artificial Intelligence) వేగంగా మార్పు చెందడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా గూగుల్‌ డీప్‌మైండ్‌ పరిశోధకుడు జోష్‌ ఎంగెల్స్‌ కూడా ఏజీఐ సేఫ్టీ టీం నుంచి వైదొలిగినట్లు ప్రకటించారు. సరైన చర్యలు తీసుకోకుంటే.. ఏఐ సిస్టమ్‌లు పెను ప్రమాదాన్ని సృష్టిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. ‘ఆంథ్రోపిక్‌, ఓపెన్‌ ఏఐ నుంచి వచ్చిన ఆఫర్లను తిరస్కరించి మరి గూగుల్‌ డీప్‌మైండ్‌ కంపెనీలో చేరాను. ఏఐ సామర్థ్యాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. తగిన చర్యలు తీసుకోకుంటే తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది. ఏఐ కంపెనీలు సూపర్‌ ఇంటెలిజెన్స్‌ను సృష్టిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీల సిస్టమ్‌లు హ్యాక్‌ అవ్వడం వంటి ఘటన చోటుచేసుకుంటున్నాయి. ఇది ప్రస్తుతం తీవ్రమైన సమస్య కానప్పటికీ రానున్న కొన్నేళ్లలో ప్రపంచంలో అతి పెద్ద సమస్యగా మారనుంది’ అని జోష్‌ ఎంగెల్స్‌ ఆందోళన వ్యక్తం చేశారు. గూగుల్‌ డీప్‌మైండ్‌ కంపెనీ నుంచి వైదొలిగి మూడు వారాల క్రితమే ఏఐ సిస్టమ్‌ల భద్రతను పరిశోధించే మోడల్ ఎవాల్యుయేషన్ అండ్ థ్రెట్ రీసెర్చ్‌ (METR) చేరినట్లు తెలిపారు. ఇలాంటి మరిన్ని కంపెనీలు అవసరమన్నారు. కాగా, ఏఐతో మనుషులకు ప్రాణాలు పొంచి ఉందని ఇప్పటికే ఆంథ్రోపిక్‌ సీఈఓ డారియో అమోడెయ్, ఓపెన్‌ఏఐ సీఈవో సామ్‌ ఆల్ట్‌మన్‌, ఎక్స్‌ఏఐ అధిపతి ఎలాన్‌మస్క్‌ సైతం ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.






