
ఇంటర్నెట్‌ డెస్క్‌: చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ (Xi Jinping) అనారోగ్యానికి సంబంధించిన ఒక వార్త సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. ఇటీవల భారత్ వేదికగా జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆయన స్పృహతప్పి పడిపోయారని.. అనంతరం అత్యవసర వైద్య చికిత్స కోసం చైనా ( China )కు తిరిగెళ్లారని వార్తలు వస్తున్నాయి. చైనా డెమోక్రటిక్ పార్టీ ఛైర్మన్, అసమ్మతి నేత వాంజున్ షీ ఎక్స్‌ వేదికగా చేసిన పోస్ట్‌తో ఈ ప్రచారం మొదలైంది. అసలేం జరిగిందంటే.. వాంజున్‌ ఇటీవల తన ఎక్స్‌ ఖాతాలో జిన్‌పింగ్‌ అనారోగ్యం గురించి సంచలన ఆరోపణలు చేశారు. బ్రిక్స్‌ సదస్సు (BRICS Summit)లో స్పృహ కోల్పోయిన ఆయనను.. హుటాహుటిన ప్రత్యేక విమానంలో చైనాకు తీసుకొచ్చారని పేర్కొన్నారు. విమానాశ్రయంలో దిగిన జిన్‌పింగ్‌ను స్వాగతించేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని, వెంటనే సైనిక హెలికాప్టర్‌లో మిలిటరీ ఆసుపత్రికి తరలించారని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలియదని, అమెరికా పర్యటనకు ముందు ఆయన (Xi Jinping) కోలుకునే అవకాశాలు ఉన్నాయో లేదో తెలియదని అన్నారు. భారత్‌లో చికిత్స పొందితే ఆయన ఆరోగ్య సమాచారం బయటకు వస్తుందనే భయంతో, ప్రాథమిక వైద్య సహాయం పొందిన వెంటనే అక్కడి నుంచి బయల్దేరినట్లు పేర్కొన్నారు. అయితే, వాంజున్‌ ఆరోపణలకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధ్రువీకరణ లేదు. చైనా ప్రభుత్వం కానీ, భారత విదేశాంగ శాఖ కానీ దీనిపై స్పందించలేదు. బ్రిక్స్‌ సదస్సులో భాగంగా సెప్టెంబర్ 12న ప్రధాని మోదీతో జిన్‌పింగ్‌ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. అయితే, విందులో ఆయన పాల్గొనలేదు. ఆ మరుసటి రోజు సదస్సులో ప్రసంగించిన చైనా అధ్యక్షుడు.. చైనాకు తిరిగి వెళ్లారు. ఇదిలా ఉండగా.. వాంజున్‌ నేతృత్వం వహిస్తోన్న చైనా డెమోక్రటిక్‌ పార్టీపై ఆ దేశంలో నిషేధం ఉంది. ప్రస్తుతం ఈ అసమ్మతి నేత అమెరికాలో ఉన్నట్లు సమాచారం. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





