
ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇజ్రాయెల్‌ ప్రధాన మంత్రులకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం వెల్లడైంది. 2019 నుంచి ఇప్పటివరకు ఆ దేశ ప్రధానుల హెయిర్‌ స్టైలింగ్‌, మేకప్‌తోపాటు (Hair and Makeup expenses) అధికారిక కార్యక్రమాల్లో హుందాగా కనిపించేందుకు అవసరమైన దుస్తులు, నిర్వహణ కోసం 4.70 లక్షల డాలర్లు ఖర్చయినట్లు తెలిసింది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ.4.49 కోట్లు. ప్రధాన మంత్రుల వ్యక్తిగత ఖర్చుల సమాచారాన్ని తెలియజేయాలని కోరుతూ యారా వింక్లర్‌ షాలిట్‌ అనే న్యాయవాది కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా.. ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి కార్యాలయం ఇటీవల సమాచారం వెల్లడించింది. అయితే, గత ఏడేళ్లలో వీటి కోసం పెట్టిన ఖర్చులో 90 శాతం నెతన్యాహు ( Benjamin Netanyahu ), ఆయన సతీమణి సారా కేశాలంకరణ, మేకప్‌ల కోసమే ఉండడం గమనార్హం. ఏఐ గురించి వాళ్లే భయపెడుతున్నారు - ట్రంప్‌ ఇజ్రాయెల్‌లో (Israel PM) 2019 నుంచి 2026 వరకు నెతన్యాహు, నఫ్తాలీ బెన్నెట్‌, యైర్‌ లాపిడ్‌లు ప్రధాన మంత్రులుగా ఉన్నారు. వీరిలో ప్రస్తుత పీఎం నెతన్యాహు ఎక్కువ కాలం ఆ పదవిలో కొనసాగుతున్నారు. వీరిలో 2022లో పీఎం పదవిలో ఉన్న నఫ్తాలీ, యైర్‌ మేకప్‌ల కోసం సుమారు రూ.26 లక్షలు ఖర్చు చేయగా.. 2023లో నెతన్యాహు కోసం ఏకంగా రూ.97లక్షలు చెల్లించినట్లు తెలిసింది. అంతేకాదు, జుట్టు, మేకప్‌లపై చేసే ఖర్చు ఏటా గణనీయంగా పెరిగిందని తాజా సమాచారం ద్వారా వెల్లడైంది. కేవలం ఒక్క ఏడాదిలోనే (2025లో) ప్రభుత్వం సుమారు రూ.1.06 కోట్లు ఖర్చు పెట్టినట్లు వెల్లడైంది. 2023 అక్టోబర్‌లో గాజాపై యుద్ధం మొదలైన సమయంలోనూ జుట్టు, మేకప్‌ కోసం నెతన్యాహు రూ.1.5 లక్షలు ఖర్చు పెట్టినట్లు తేలింది. విదేశీ ప్రయాణాల సమయంలోనూ వీటి కోసం ఖర్చు పెట్టారట. గతేడాది ఫిబ్రవరిలో నాలుగురోజుల అమెరికాలో పర్యటించిన సమయంలో రూ.12.9లక్షలు, అంతకుముందు ఏడాది వాషింగ్టన్‌ వెళ్లినప్పుడు దాదాపు రూ.11 లక్షలు జట్టు, మేకప్‌ కోసం ఖర్చు పెట్టారని వెల్లడైంది. నెతన్యాహు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు దుస్తులు, ఇతర నిర్వహణ కోసం సుమారు రూ.1.28 కోట్ల ఖర్చు అయ్యిందని తెలిసింది. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా హెయిర్‌ స్టైలిస్టులు, మేకప్‌ ఆర్టిస్టుల వివరాలను పీఎంవో వెల్లడించలేదు. ఈ ఖర్చుల వ్యవహారంపై ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి కార్యాలయంపై స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




