
భారత క్రికెట్ నియంత్రణ మండలి (Board of Control for Cricket in India) ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (Women’s Premier League – WPL) ఐదో సీజన్ షెడ్యూల్ నేడు అంటే బుధవారం అధికారికంగా ఖరారు చేసింది. 2027 జనవరి 14 నుంచి ఫిబ్రవరి 7 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. ఈ టోర్నీకి సంబంధించిన ప్లేయర్ల వేలం ప్రక్రియను అక్టోబర్ 28న కొచ్చి (Kochi) నగరంలో నిర్వహించనున్నారు. అయితే, మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చే నగరాల వివరాలను బోర్డు ప్రస్తుతానికి వెల్లడించలేదు. మహిళల క్రికెట్లో అతిపెద్ద టీ20 లీగ్‌గా అవతరించిన ఈ టోర్నమెంట్, దేశ విదేశాలకు చెందిన అగ్రశ్రేణి క్రీడాకారిణులతో పాటు వర్ధమాన ప్రతిభను ఒకే వేదికపైకి తెచ్చి అత్యున్నత స్థాయి ప్రదర్శన ఇచ్చేందుకు దోహదపడుతోందని బీసీసీఐ ప్రత్యేక ప్రకటనలో పేర్కొంది.





