
Russia Sanctions Bill| ఇంటర్నెట్‌డెస్క్‌: రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాల ఎగుమతులపై 100 శాతం టారిఫ్‌లకు వీలుకల్పించే బిల్లుకు అమెరికా చట్టసభల్లో ఆమోదం లభించింది. దీనిపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ( Donald Trump ) సంతకం చేస్తే.. భారత్‌పై నూరుశాతం సుంకాలు పడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ ఆంక్షల బిల్లును ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని వెల్లడించింది. ‘‘గతంలో చెప్పినట్టుగానే భారత్‌ తన 140 కోట్లమంది ప్రజలకు ఇంధన భద్రతను కల్పించడానికి కట్టుబడి ఉంది. మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా వేర్వేరు వనరుల నుంచి ఇంధన దిగుమతులను కొనసాగిస్తాం. రష్యాతో చమురు వాణిజ్యం అంశంపై అమెరికా ప్రతినిధులతో ఇప్పటికే చర్చించాం. ద్వైపాక్షిక సంబంధాలపై మాత్రమే కాకుండా అంతర్జాతీయ ఇంధన మార్కెట్ల స్థిరత్వంపై కూడా ఈ బిల్లు ప్రభావం చూపించే అవకాశం ఉందని స్పష్టంగా తెలియజేశాం. భారత వాణిజ్య, ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించుకోవడానికి అవసరమైన అన్ని చర్యలను భారత ప్రభుత్వం తీసుకుంటుందని యూఎస్‌కు ఇప్పటికే చెప్పాం. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే భారత వాణిజ్యంపై పడే ప్రభావాలను ఎదుర్కొనేందుకు సంబంధిత సంస్థలతో కలిసి పనిచేస్తున్నాం’’ అని కేంద్ర విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





