

- ఆర్టిఫిషియల్ సన్ ప్రాజెక్ట్‌లో పురోగతి
- టోకమాక్లో కొత్త గైరోట్రోన్ పరికరం
- ఫ్యూజన్ పరిశోధనల్లో భారత్ రికార్డు
India Artificial Sun: భారతదేశం స్వదేశీ ఫ్యూజన్ పరిశోధనల్లో మరో చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఉన్న ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్ (IPR) శాస్త్రవేత్తలు తమ డోనట్ ఆకారపు ‘SST-1’ (స్టెడీ స్టేట్ సూపర్ కండక్టింగ్ టోకమాక్) పరికరంలో శక్తివంతమైన(India Artificial Sun) ‘82.6 GHz, 400 kW గైరోట్రోన్’ వ్యవస్థను విజయవంతంగా అమర్చి, ప్రారంభించారు. సూర్యుడిలో జరిగే కేంద్రక సంలీనం (న్యూక్లియర్ ఫ్యూజన్) ప్రక్రియను భూమిపై పునఃసృష్టించి, కృత్రిమ సూర్యుడిని తయారు చేసే దిశగా భారత్ వేస్తున్న వేగవంతమైన వేగానికి ఈ సాంకేతిక అభివృద్ధి మరింత ఊతాన్నిస్తోంది.
ప్లాస్మా అంటే ఏమిటి.. ఎందుకు అంత వేడి?
సాంప్రదాయ అణువిద్యుత్ కేంద్రాల వలె కాకుండా, ఫ్యూజన్ రియాక్టర్లు విపరీతమైన ఉష్ణోగ్రతలు, తీవ్రమైన ఒత్తిడి వద్ద తేలికపాటి పరమాణు కేంద్రకాలను విలీనం చేయడం ద్వారా స్వచ్ఛమైన శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఈ ప్రక్రియలో పదార్థం నా అత్యంత వేడి, విద్యుదీకృత స్థితి అయిన ‘ప్లాస్మా’గా మారుతుంది. ఇప్పటికే భారతీయ శాస్త్రవేత్తలు సూర్యుని కేంద్రకం కంటే 20 రెట్లు ఎక్కువ ఉష్ణోగ్రత కలిగిన అంటే 200 మిలియన్ డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత గల ప్లాస్మాను సృష్టించి రికార్డు సృష్టించారు.
ఈ కొత్త ‘గైరోట్రోన్’ పరికరం ప్రత్యేకత ఏమిటి?
ఫ్యూజన్లో కేవలం విపరీతమైన వేడిని సాధించడమే కాక, ఆ ప్లాస్మాను స్థిరంగా ఉంచడం అతిపెద్ద సవాలు. గైరోట్రోన్ అనేది అధిక పౌనఃపున్యం కలిగిన మైక్రోవేవ్ శక్తిని ఉత్పత్తి చేసే అత్యాధునిక పరికరం. సూర్యుడిలో గురుత్వాకర్షణ శక్తి ప్లాస్మాను పట్టి ఉంచితే, టోకమాక్లో అయస్కాంత క్షేత్రాల ద్వారా దీనిని నియంత్రిస్తారు. ఈ కొత్త 82.6 GHz వ్యవస్థ ద్వారా ప్లాస్మాలోకి నేరుగా మైక్రోవేవ్ శక్తిని పంపి, దానిని అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద సుదీర్ఘకాలం స్థిరంగా ఉంచడానికి వీలవుతుంది. ఇది వరకు ఉన్న 42 GHz వ్యవస్థ కంటే ఇది ఎంతో శక్తివంతమైనది.
భారత భవిష్యత్ శక్తి అవసరాలకు దిక్సూచి:
ఈ ప్రయోగం ద్వారా వెంటనే విద్యుత్ ఉత్పత్తి కాకపోయినప్పటికీ, భవిష్యత్తులో నిరంతర క్లీన్ ఎనర్జీ సాధించడానికి ఇది అత్యంత ప్రాధాన్యత కలిగిన దశ. ఫ్యూజన్ శక్తి లభ్యతకు అవసరమైన ఇంధనం సమృద్ధిగా లభించడమే కాక, ఎలాంటి హానికర రేడియోధార్మిక వ్యర్థాలు ఉత్పత్తి కావు. నక్షత్రాల శక్తితో భూమికి వెలుగులు పంచే భారత్ స్వప్నానికి ఈ సరికొత్త రికార్డు సరికొత్త దిశను నిర్దేశిస్తోంది.





