
ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా తన ఆయుధాలను అంతరిక్షంలో మోహరించినట్లు తొలిసారి అంగీకరించింది. ‘ఎయిర్‌, స్పేస్‌, సైబర్‌ కాన్ఫరెన్స్‌’లో ఆ దేశ స్పేస్‌ ఫోర్స్‌ (US Space Force) సెక్రటరీ ట్రాయ్‌ మెయింక్‌ మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. శత్రు దేశాల బెదిరింపుల నుంచి అమెరికా, మిత్ర దేశాలను సమర్థవంతంగా కాపాడేందుకు కక్ష్యలో ఉన్న ఈ ఆయుధాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. అయితే.. ఏ రకమైన ఆయుధాలను అమెరికా ( USA ) అక్కడ మోహరించిందో మాత్రం వెల్లడించలేదు. అంతరిక్షంలోని అమెరికా నియంత్రణ వ్యవస్థలు దాడులు, ఆత్మరక్షణకు ఉపయోగపడతాయని తెలిపారు. అమెరికా స్పేస్‌ ఫోర్స్‌ కమాండ్‌.. ముఖ్యంగా చైనా, రష్యాను అంతరిక్షంలో ప్రధాన ప్రత్యర్థులుగా భావిస్తోంది. ఇప్పటికే చైనా స్పేస్‌, కౌంటర్‌ స్పేస్‌ వ్యవస్థలను తన మిలిటరీ ఆధునికీకరణలో భాగంగా చేసుకుందని చెబుతోంది. మరోవైపు రష్యా అంతరిక్షాన్ని కూడా యుద్ధరంగంగానే పరిగణిస్తోందని.. భవిష్యత్తు యుద్ధాల్లో ఇక్కడ ఆధిపత్యం అత్యవసరమని భావిస్తోందని అమెరికా స్పేస్‌ కమాండ్‌ వెల్లడించింది. యుద్ధం మరో టర్న్‌: సౌదీ పైప్‌లైన్ మూసివేత.. భారత్‌పై ప్రభావమెంత? ప్రచ్ఛన్న యుద్ధం నాటి నుంచి అంతరిక్షంలో ఆయుధాల మోహరింపుపై వ్యూహాలు సిద్ధమయ్యాయి. అమెరికా, రష్యాలు తమ ఉపగ్రహాలను కాపాడుకునేందుకు అవసరమైన మార్గాలను చాలాకాలంగా అన్వేషిస్తున్నాయి. 1967లో ఔటర్‌ స్పేస్‌ ఒప్పందం కారణంగా అంతరిక్షంలో సామూహిక జనహనన ఆయుధాల మోహరింపుపై నిషేధం ఉంది. దీంతో అమెరికా, రష్యా, చైనా దేశాలు ఇవి కాకుండా ఇతర ఆయుధ వ్యవస్థల మోహరింపుపై దృష్టి సారించాయి. ముఖ్యంగా ప్రత్యర్థుల నిఘా, కమ్యూనికేషన్‌, నేవిగేషన్‌ ఉపగ్రహాలను లక్ష్యంగా చేసుకునే దిశగా వ్యూహరచన చేశాయి. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





