
ఇంటర్నెట్ డెస్క్: గత ఏడాది పురుషుల ఆసియా కప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టు.. ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) చైర్మన్ మోసిన్‌ నఖ్వీ (పాక్‌ మంత్రి, ఆ దేశ క్రికెట్‌ బోర్డు ఛైర్మన్‌) నుంచి ట్రోఫీ అందుకోవడానికి నిరాకరించిన విషయం తెలిసిందే. ఆదివారం జరిగిన ఆసియా కప్‌ మహిళల క్రికెట్‌ టోర్నీలో టీమ్ఇండియా విజేతగా నిలిచింది. ట్రోఫీ ప్రదానోత్సవానికి నఖ్వీ హాజరు కావడంతో గత ఏడాది దృశ్యమే పునరావృతమైంది. అతడి (Mohsin Naqvi) నుంచి ట్రోఫీని తీసుకోవడానికి భారత జట్టు నిరాకరించింది. మోసిన్ నఖ్వీ ట్రోఫీని అందజేస్తే.. ప్రదానోత్సవానికి భారత మహిళల జట్టు హాజరుకాదని బీసీసీఐ ముందుగానే ఆసియా క్రికెట్ కౌన్సిల్‌ (ACC)కు తెలియజేసింది. అందుకు నఖ్వీ కూడా ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా (Rajeev Shukla) తెలిపారు. ‘‘మేము ఈ విషయంపై చర్చించుకుని నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించకూడదని నిర్ణయించుకున్నాం. అది మా ఉమ్మడి నిర్ణయం. దీనికి నఖ్వీ కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఈ పరిణామాల గురించి మా జట్టుకు తెలియజేశాం. ఏసీసీ ఛైర్మన్‌ ట్రోఫీని ఎవరికి అప్పగించాలో.. వారికి అప్పగించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు’’ అని రాజీవ్ శుక్లా తెలిపారు. ప్రస్తుత ఐసీసీ ( ICC ) చైర్మన్ (జైషా) ఏసీసీలో ఉన్నప్పుడు.. విజేతగా నిలిచిన జట్టుకు చెందిన ఆఫీస్‌ బేరర్ ట్రోఫీని అందజేయడం అనేది ఒక సంప్రదాయంగా ఉండేదని బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా గుర్తుచేశారు. కానీ గత ఏడాది నుంచి ఏసీసీ ఈ సంప్రదాయాన్ని పాటించడం లేదన్నారు. త్వరలోనే పురుషుల, మహిళల జట్ల ఆసియా కప్ ట్రోఫీలు భారత్‌కు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.