
Double Stack Trains | ఇంటర్నెట్‌ డెస్క్‌: సరకు రవాణాలో భారతీయ రైల్వే అరుదైన రికార్డు సృష్టించింది. ప్రపంచంలో మరే దేశానికీ సాధ్యం కాని మొదటి పూర్తి ఎలక్ట్రిఫైడ్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్‌ను ఇటీవల అందుబాటులోకి తెచ్చింది. అమెరికా, కెనడా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో డబుల్‌ స్టాక్‌ రైళ్లు ఎప్పటినుంచో నడుస్తున్నా.. అవి డీజిల్‌ ఇంజిన్లతోనే నడుస్తున్నాయి. కానీ, విద్యుత్‌ వైర్లు కలిగిన పూర్తి సరకు రవాణా మార్గం కలిగిన ఏకైక దేశంగా భారత్‌ వాటి ముందు సగర్వంగా నిలిచింది. సరకు రవాణాను వేగవంతం చేసే ఉద్దేశంతో భారత ప్రభుత్వం డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ను (DFCCIL) 2006లో ఏర్పాటు చేసింది. ఇందులో తూర్పు డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌ (EDFC) ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. దీని పొడవు 1337 కిలోమీటర్లు. 1506 కిలోమీటర్ల వెస్టర్న్‌ డెడికేటెడ్‌ కారిడార్‌లోని 326 కిలోమీటర్ల పొడవైన చివరి మూడు సెక్షన్లను ప్రధాని మోదీ ఇటీవల జాతికి అంకితం చేయడంతో డబ్ల్యూడీఎఫ్‌సీ (WDFC) పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. మొత్తం సరకు రవాణా మార్గం 2,843 కిలోమీటర్లకు చేరింది. వెస్టర్న్‌ కారిడార్‌ ప్రపంచంలోనే మొదటి పూర్తి ఎలక్ట్రిఫైడ్ ఫ్రైట్ నడవా. ఇందులో డబుల్-స్టాక్ కంటైనర్ ట్రైన్లు నడుస్తాయి. ఎత్తైన ఓవర్‌హెడ్ వైర్లు (సుమారు 7.45 మీటర్లు) ఉండడం వల్ల రెండు కంటైనర్లను ఒకదాని పైన ఒకటి పెట్టి రవాణా చేయవచ్చు. దీనివల్ల ఒకే ట్రైన్‌లో ఎక్కువ సరకు తరలించొచ్చు. ఇంధన వినియోగం, ఉద్గారాలు తగ్గుతాయి. సాధారణ రైలు మార్గాల్లో ప్యాసింజర్‌ రైళ్లకు ఆటంకాలు తగ్గుతాయి. ఈ మార్గాల్లో ప్రయాణించే భారీ లోడ్‌ కలిగిన సరకు రవాణా రైళ్ల పొడవు కిలోమీటరు పైనే ఉంటుంది. ఇందుకోసం ముందు భాగంలో అత్యాధునిక 12,000 హెచ్‌పీ ఇంజన్, మధ్యలో 9,000 హెచ్‌పీ కలిగిన ఇంజిన్‌ను ఉపయోగిస్తుంటారు. 📢 First Long Haul (1.3 km) Double Stack container train on Western Dedicated Freight Corridor JNPT, Mumbai -> Vadodara, Gujarat pic.twitter.com/CY9kWabvrM డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (డీఎఫ్‌సీ) అందుబాటులోకి రావడం వల్ల భారతదేశ రవాణా రంగం సరికొత్త రూపురేఖలు సంతరించుకుందని ప్రధాని మోదీ అన్నారు. లాజిస్టిక్స్ ఖర్చులు, ప్రయాణ సమయం గణనీయంగా తగ్గాయని పేర్కొన్నారు. ఇటీవల ముంబయిలోని జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ, వడోదర మధ్య నడిచిన డబుల్-స్టాక్ కంటైనర్ రైలు ఒకే ట్రిప్‌లో ఏకంగా 250కి పైగా ట్రక్కులకు సమానమైన సరకును మోసుకెళ్లిందని గుర్తుచేశారు. 2,800 కిలోమీటర్ల పొడవైన తూర్పు, పశ్చిమ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు దేశ వాణిజ్యానికి వెన్నెముకగా నిలిచాయని ప్రధాని అన్నారు. గతంలో సరకు రవాణా రైలు 100 కిలోమీటర్లు వెళ్లేందుకు 6.5 గంటల సమయం పట్టేదని, ఇప్పుడు అందులో సగం కంటే తక్కువ సమయంలోనే గమ్యస్థానానికి చేరుకుంటోందని తెలిపారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





