
మహబూబాబాద్‌లో 19.1 సెం.మీ. వర్షం నెల్లికుదురు శివారు మర్రికుంటవాగు కల్వర్టు వద్ద తెగిన రహదారి ఈనాడు, హైదరాబాద్‌: ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు 9 జిల్లాల్లో జోరు వానలు పడ్డాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రంలో 19.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ జిల్లాలోని నెల్లికుదురు, నర్సింహులపేట, మహబూబాబాద్, పెద్దవంగర, దంతాలపల్లితోపాటు పలు మండలాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. వరంగల్‌ జిల్లాలోని రాయపర్తి, వర్ధన్నపేట, పర్వతగిరి, నెక్కొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూరు, రామన్నపేట, చౌటుప్పల్, చిట్యాల, వెలిగొండ, అడ్డగూడూరు, సూర్యాపేట జిల్లాలోని జాజిరెడ్డిగూడెం, నాగారం, మద్దిరాల, తిరుమలగిరి మండలాల్లో భారీగా కురిశాయి. వాగులు, వంకలు పొంగి పొర్లి.. చెరువులు నిండుకుండలా మారాయి. పలు మండలాల్లో పంటలు నీట మునిగాయి. రోడ్లు తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్లా ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. సోమ, మంగళవారాల్లోనూ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాలకు ‘పసుపు’ రంగు హెచ్చరికలు జారీ చేసింది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




