
దిల్లీ: నెలలు నిండకుండా జన్మించడంతోపాటు ఆరోగ్య సమస్యలు తలెత్తిన పసికందును నిర్దాక్షిణ్యంగా ఆసుపత్రిలో వదిలి వెళ్లిన తల్లిదండ్రులను దిల్లీ కోర్టు దోషులుగా తేల్చింది. ఐపీసీ సెక్షన్‌ 317 కింద వారికి శిక్ష ఖరారు చేయనుంది. హీనా రే అలియాస్‌ రీనా, జీతు కుమార్‌ దంపతులు. 2014 డిసెంబరు 12న దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ ఆసుపత్రిలో రీనా ఆడపిల్లకు జన్మనిచ్చింది. తీవ్ర ఆరోగ్య సమస్యలున్న ఆ పసికందును నవజాత శిశువుల ప్రత్యేక చికిత్స కేంద్రంలో చేర్చారు. ఆ తర్వాత దంపతులు ఇద్దరూ వెళ్లిపోయి ఎంతకూ తిరిగి రాలేదు. ఆసుపత్రి వర్గాలు ఆ చిన్నారిని శిశు సంరక్షణ కేంద్రానికి అప్పగించగా 2015 మార్చిలో చనిపోయింది. దీనిపై కేసు నమోదు కాగా డీఎన్‌ఏ పరీక్షలు, ఇతర ఆధారాల ద్వారా కోర్టు... తల్లిదండ్రులిద్దరినీ గుర్తించి వారిపై విచారణ జరిపింది. అదనపు సెషన్స్‌ జడ్జి సునీల్‌ కుమార్‌ తీర్పు వెలువరిస్తూ వారిని దోషులుగా నిర్దారించారు. మంచి చికిత్స కోసమే చిన్నారిని స్పెషాలిటీ హాస్పిటల్‌లో చేర్చామని, నిర్లక్ష్యంగా వదిలివేయలేదన్న తల్లిదండ్రుల వాదనలను తోసిపుచ్చారు. 12 ఏళ్లలోపు వయసు కన్నబిడ్డలను, తమ సంరక్షణలో ఉన్న చిన్నారులను ఉద్దేశపూర్వకంగా వదిలిపెట్టిన వారికి ఐపీసీ సెక్షన్‌ 317 రెడ్‌ విత్‌ సెక్షన్‌ 34 కింద ఏడేళ్ల వరకూ శిక్ష విధించే అవకాశం ఉంది. దోషులైన హీనా రే, జీతు కుమార్‌లకు త్వరలో కోర్టు శిక్షా కాలాన్ని నిర్ణయించనుంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




