
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వాటికీ ఉపశమనం సరికొత్తగా అప్పీళ్ల వ్యవస్థ.. పారదర్శకతకు వీలు ఈనాడు, హైదరాబాద్‌: నిషేధిత భూముల జాబితాలో చేరిన నివాసాలు, అపార్టుమెంట్లు ఇతర ఆవాసాల బాధితులకు ఊరట కలిగే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. దీర్ఘకాలం నుంచి ‘22ఏ’లోనే కొనసాగుతుండగా... ఇటీవల అవన్నీ ఒక్కసారిగా తెరపైకి రావడంతో అయోమయ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆస్తుల విక్రయాలు, రిజిస్ట్రేషన్లకు వెళ్లిన సమయంలో సబ్‌ రిజిస్ట్రార్లు అడ్డుచెబుతున్నారు. దీంతో హైదరాబాద్‌ పరిసర జిల్లాల్లో ఈ అంశం చర్చకు దారి తీసింది. అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌(యూఎల్‌సీ), ఎసైన్డ్, భూదాన్, హెచ్‌ఎండీఏ లేఅవుట్లు, భూముల క్రమబద్ధీకరణ, కోర్టు కేసులకు సంబంధించిన భూములు ‘22ఏ’ జాబితాలో దర్శనమిచ్చాయి. గతంలో ఆయా భూములకు ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు వచ్చినా.. రెవెన్యూ రికార్డుల్లో మాత్రం యాజమాన్య హక్కులు నమోదుకాకపోవడంతో ప్రభుత్వ భూములుగానే కనిపిస్తున్నాయి. ఇప్పుడు వీటన్నింటినీ పరిష్కరించేందుకు ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవడం బాధితులకు ఉపశమనంగా మారనుందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు.. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల చట్టంలో భాగంగా 22ఏ(నిషేధిత జాబితా)ను అమలు చేస్తున్నారు. రెవెన్యూ శాఖ భూముల క్లాసిఫికేషన్‌(రకం)ను నిర్ధారిస్తుంది. జిల్లా కలెక్టర్‌ ఈ మేరకు గెజిట్‌ను జారీ చేస్తూ సర్వే నంబర్లు, డివిజన్లు, విస్తీర్ణం, ప్రాంతం తదితర వివరాలు రిజిస్ట్రేషన్ల శాఖకు పంపుతారు. రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆ సర్వే నంబర్లను నిషేధిత జాబితాలో చేర్చుతారు. ఇదే మాదిరి.. తొలగించడం(డీ నోటిఫికేషన్‌) కూడా కలెక్టర్‌ సిఫార్సుతో ఐజీ పూర్తి చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వం ఈ వ్యవస్థను సరళీకృతం చేస్తూ నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ డివిజన్‌ అధికారి, సబ్‌ కలెక్టర్‌లకు అధికారాలు అప్పగిస్తామని ప్రకటించింది. దీనికితోడు మాన్యువల్‌ పద్ధతికి స్వస్తి చెప్పి ఆన్‌లైన్‌లో నిషేధిత జాబితాలను నిర్వహించాలన్న నిర్ణయంతో పారదర్శకత మరింత పెరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఒక కలెక్టర్‌ డీ నోటిఫై చేస్తే మరో కలెక్టర్‌ దాన్ని నోటిఫై చేస్తూ రాతపూర్వక మెమోలు జారీ చేసే పద్ధతికి కూడా చెక్‌ పడుతుందని పేర్కొంటున్నారు. ‘22ఏ’ నుంచి మినహాయింపునకు ఇప్పటి వరకు కలెక్టర్ల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేది. ఇదే సమయంలో విలువైన ప్రభుత్వ భూములను రాజకీయ, ఇతరత్రా ఒత్తిళ్లు, ఆమ్యామ్యాలకు ఆశపడి కొందరు కలెక్టర్లు జాబితా నుంచి తొలగిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఏవైనా అభ్యంతరాలున్నా కలెక్టర్‌నే సంప్రదించాల్సి ఉండటంతో ఏకపక్షంగా ఈ విధానం మారింది. ఇప్పుడు ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలతో పారదర్శకత ఏర్పడుతుందన్న చర్చ నడుస్తోంది. పైగా ఆర్డీవో స్థాయిలో న్యాయం జరగకపోతే సబ్‌ కలెక్టర్‌ స్థాయిలో.. లేదంటే ప్రభుత్వాన్ని ఆశ్రయించడానికి అప్పీళ్ల వ్యవస్థ పెట్టడం ద్వారా జవాబుదారీ తనం పెరగడంతోపాటు ప్రభుత్వ భూములు కొల్లగొట్టాలన్న ప్రయత్నాలు బహిర్గతమయ్యే అవకాశాలూ ఉంటాయని రెవెన్యూ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




