
ప్ర జల దైనందిన జీవితంలో విడదీయరాని భాగమైన యూపీఐ చెల్లింపుల్లో కొన్నింటిపై రుసుములు విధించాలన్న సర్కారీ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. వ్యక్తుల నుంచి వ్యాపారులకు (పీటూఎం) జరిగే రెండువేల రూపాయలకు పైబడిన లావాదేవీలపైనే నిర్ణీత ఛార్జీలుంటాయని కేంద్రం ప్రకటించింది. సామాన్యులపై ఎలాంటి భారం ఉండదని, పెద్ద వ్యాపారులే దాన్ని భరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. వాస్తవానికి రూ.2వేలకు మించిన పీటూఎం లావాదేవీల సంఖ్య మొత్తం యూపీఐ ట్రాన్సాక్షన్లలో నాలుగు శాతమే! కానీ, బదిలీ అయ్యే సొమ్ము విలువలో మాత్రం వాటి వాటా మూడింట రెండొంతుల దాకా ఉంటుంది. కాబట్టి తాము చెల్లించాల్సిన మర్చంట్‌ డిస్కౌంట్‌ రేటు(ఎండీఆర్‌)ను వ్యాపారులు వస్తుసేవల ధరవరల్లో కలిపేసే ప్రమాదం లేకపోలేదు. అదే జరిగితే అంతిమంగా వినియోగదారులే నష్టపోవాల్సి వస్తుంది. మరోవైపు, ఎండీఆర్‌ని సాకుగా చూపి వ్యాపారులు నగదు చెల్లింపుల వైపు మళ్లితే దేశ డిజిటల్‌ ఆర్థిక రథం తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతుంది. నల్లధనానికి అదనపు కోరలు మొలుచుకొచ్చి ఆర్థిక అసమానతలు జడలువిప్పే ముప్పు సైతం పొంచి ఉంది. గడచిన పదేళ్లలో లావాదేవీల పరంగా యూపీఐ 13వేల రెట్ల వృద్ధిని నమోదు చేసింది. అదే సమయంలో ట్రాన్సాక్షన్ల విలువ నాలుగు వేల రెట్లకు పైగా పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అది రూ.368 లక్షల కోట్లకు చేరవచ్చునని అంచనా. బడ్డీకొట్లు మొదలు సూపర్‌ మార్కెట్లు, పెద్ద షాపింగ్‌ మాల్స్‌ వరకూ ఎక్కడైనా సులువుగా, సురక్షితంగా చెల్లింపులు జరిపే వీలుండటమే యూపీఐ విజయానికి ప్రధాన కారణం. 85శాతానికి పైగా భారతీయ కుటుంబాలు స్మార్ట్‌ఫోన్లను ఉపయోగిస్తున్న నేపథ్యంలో ప్రత్యేకంగా కార్డులను వెంటతీసుకెళ్లాల్సిన పనిలేని డిజిటల్‌ చెల్లింపులకే చాలామంది మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో భౌతిక నగదు వినియోగం బాగా దిగివచ్చినట్లు ఐఎంఎఫ్‌ బృంద పరిశోధనా పత్రం నిరుడు వెల్లడించింది. దాని ప్రకారం, 2015-24 మధ్య ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలు గణనీయంగా తగ్గిపోయాయి. ఇలా డిజిటల్‌ భారత్‌ లక్ష్యాలకు చేరువవుతున్న క్రమంలో యూపీఐ ఉచిత వినియోగంపై ఆంక్షలు విధించడమనేది దీర్ఘకాలంలో దేశార్థిక వ్యవస్థకు అంతగా లాభదాయకం కాదు! దేశీయంగా కరెన్సీ ముద్రణకు గత ఆర్థిక సంవత్సరంలో సుమారు అయిదు వేల కోట్ల రూపాయలు వ్యయమయ్యాయి. అదనంగా ఏటీఎంల నిర్వహణ ఖర్చులు ఉండనే ఉంటాయి. యూపీఐ వ్యవస్థను బలోపేతం చేయడానికంటూ తెస్తున్న ఎండీఆర్‌ మూలంగా నగదు చెల్లింపులు అనివార్యమైతే కరెన్సీ వ్యయభారాలకు కొత్త రెక్కలొస్తాయి. మరోవైపు, డిజిటల్‌ చెల్లింపులూ జీఎస్టీ రాబడులకు నడుమ సానుకూల సంబంధం ఉన్నట్లు పరిశీలనలు వెల్లడిస్తున్నాయి. యూపీఐపై రుసుములతో నగదు లావాదేవీలు అధికమై ఆ లెక్కలన్నీ పద్దుల్లోకి ఎక్కకపోతే జీఎస్టీ వసూళ్లు మందగించే అవకాశం ఉంది. యూపీఐతో చెల్లింపులు సులభతరం కావడం, వినియోగదారుల సమయం ఆదా అవ్వడం వల్ల 2022లో భారత జీడీపీకి 1,620 కోట్ల డాలర్ల అదనపు ఆర్థిక విలువ జతపడినట్లు రెండేళ్ల కిందట నాస్కామ్‌ అంచనా వేసింది. లావాదేవీల్లో అడ్డంకులను తొలగించిన యూపీఐ- చిన్న వ్యాపార కార్యకలాపాలను క్రమబద్ధీకరించింది. నూతన ఆర్థిక ఉత్పత్తులకు వీలుకల్పించింది. వీటన్నింటి దృష్ట్యా యూపీఐపై రుసుముల విధింపు గురించి ప్రభుత్వం పునరాలోచించాలి. దేశ విశాల ప్రయోజనాల రీత్యా తగిన ప్రోత్సాహకాలు అందిస్తూ ఆ వ్యవస్థను పటిష్ఠపరచాలి. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.



