
రెవెన్యూ శాఖ కార్యాచరణ సిద్ధం ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఇంటిస్థలం లేని పేదలకు పట్టాలిచ్చేందుకు రెవెన్యూ శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల్ని విచారించిన రెవెన్యూ శాఖ.. 1,24,873 మందికి కొత్తగా స్థలాలివ్వాలని గుర్తించింది. కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున పేదలకు స్థలాలు ఇవ్వాలంటే 4,800 ఎకరాలు సేకరించాలని తేల్చింది. భూసేకరణకు రూ.1,800 కోట్లు అవసరమని అంచనా వేసింది. నవంబరు నుంచి భూసేకరణ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా ఇళ్లస్థలాలు లేని పేదల వివరాలనూ సేకరించి అర్హుల జాబితా రూపొందించనున్నారు. ఇళ్లస్థలాల దరఖాస్తుల్ని రెవెన్యూ శాఖ ఆన్‌లైన్‌ ద్వారా తీసుకుంటోంది. ఇప్పటివరకు 4,59,051 మంది దరఖాస్తు చేశారు. వీరిలో 1,43,496 మందిని అర్హులుగా, 1,88,861 మంది అనర్హులని తేల్చారు. 41% దరఖాస్తుల్ని తిరస్కరించారు. కొన్ని జిల్లాల్లో తిరస్కరించిన దరఖాస్తులు 50% పైనే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 1,26,694 దరఖాస్తులపై విచారణ చేయాలి. వైకాపా హయాంలో సెంటు చొప్పున ఇళ్లస్థలాల పంపిణీకి భూములు సేకరించినా.. అందులో చాలాచోట్ల లోతట్టు ప్రాంతాలు కావడంతో మెరక తోలేందుకు పెద్దమొత్తంలో ఖర్చవుతోంది. అంతకంటే కొత్తగా భూసేకరణ చేయడమే మేలనే అభిప్రాయంలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే ఇళ్లపట్టాలు తీసుకున్న వారిలో చాలామంది అక్కడ ఇళ్లు కట్టుకునేందుకు సిద్ధంగా లేరు. వారు కోరితే పట్టాలు రద్దుచేసి.. కొత్తగా కేటాయించనున్నారు. ః మరికొన్ని చోట్ల సేకరించిన భూములకు పరిహారం చెల్లించలేదు. అలాంటివాటిలో నిర్మాణాలకు అనువుగా ఉండేవాటిని గుర్తించి, పరిహారం చెల్లించి అర్హులకు స్థలాలిచ్చి ఇళ్లు కట్టించాలని కలెక్టర్ల సదస్సు సందర్భంగా సీఎం చంద్రబాబు ఆదేశించారు. ః వైకాపా హయాంలో ఇచ్చినవాటిలో 43,498 ఇళ్ల పట్టాలు అనర్హులకు ఇచ్చినట్లు గుర్తించి, రద్దుచేశారు. ఆ స్థలాల్ని ఇతరులకు కేటాయించనున్నారు. తొలివిడతలో 1.25 లక్షల మందికి రా ష్ట్రవ్యాప్తంగా ఇళ్లులేని పేదలు 2.50 లక్షల మంది ఉంటారని అంచనా. ఇప్పటివరకు అందిన దరఖాస్తుల్ని విచారించాక తొలివిడతలో 1.43 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. వివిధ ప్రాంతాల్లో 2.56 లక్షల ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 1,692 గ్రామాల్లోని స్థలాలు తీసుకునేందుకు 18,623 మందే అంగీకరించారు. మిగిలిన 1,24,873 మందికి 3,034 గ్రామాల్లో భూసేకరణ చేసి ఇళ్లస్థలాలు ఇవ్వాలి. సగటున ఎకరాకు రూ.37.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలి. అక్టోబరుకు అర్హుల జాబితా రూపొందించి నవంబరు నుంచి భూసేకరణ ప్రారంభించనున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





