
అక్రమాలు నిగ్గుతేలినాఅడ్డుకోని అధికారులు వై.పాలెంలో ఇదో భూబాగోతం న్యూస్‌టుడే, యర్రగొండపాలెం పట్టణం అన్యాక్రాంతమైన అసైన్డ్‌ భూమి పేదలకు పంచిన భూములపై అక్రమార్కుల కన్నుపడింది. అంతే... నకిలీ పత్రాలు సృష్టించి తొలుత ఓ కంపెనీకి విక్రయించారు. బాధితుల ఫిర్యాదుతో అవి రద్దయినా... మరికొన్ని భూములను వేరొకరికి విక్రయించి ఆన్‌లైన్‌ చేశారు. ఈ వివాదం కొనసాగుతుండగానే... మిగిలిన భూముల విక్రయానికి అడ్వాన్సులు తీసుకుంటున్నారు. మరోవైపు ప్రస్తుతం చేపడుతున్న రీసర్వే సైతం ఆన్‌లైన్‌లో ఉన్న వారి పేరిటే చేస్తుండడంతో అసలు లబ్ధిదారులు ఆందోళనకు గురై న్యాయం చేయాలంటూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. యర్రగొండపాలెం పరిధిలో జరుగుతున్న భూబాగోతం ఇది. వై.పాలెం మండలం వెంకటాద్రిపాలెం ఇలాకాలోని వివిధ సర్వే నంబర్లలోని మొత్తం 195 ఎకరాలను... వీరభద్రాపురం, వెంకటాద్రిపాలెం గ్రామాల్లోని పేదలకు ప్రభుత్వం పంచిపెట్టి అసైన్డ్‌ పట్టాలు మంజూరు చేసింది. ఇదంతా 1996లో జరిగింది. నీటి వసతి లేక ఆయా భూములు సాగుకు నోచుకోలేదు. దీంతో అక్రమార్కులు వీటిపై కన్నేశారు. కొందరు రెవెన్యూ అధికారుల సహకారంతో నకిలీ పత్రాలు సృష్టించి 2004లో ఫెర్రల్స్‌ చిట్‌ఫండ్‌ కంపెనీ పేరిట రిజిస్టర్‌ చేయించారు. విషయం బయటకు తెలియడంతో లబ్ధిదారులు అప్పటి కలెక్టర్‌ కృష్ణబాబుకు ఫిర్యాదు చేశారు. ఆయన విచారణ జరిపించి అక్రమమని తేలడంతో 2006లో ఆ రిజిస్ట్రేషన్లను రద్దు చేశారు. కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్న అక్రమార్కులు మళ్లీ రంగంలోకి దిగారు. అనుకూలంగా ఉన్న రెవెన్యూ అధికారుల సాయంతో దొంగ పత్రాలు సృష్టించారు. సర్వే నంబర్‌ 387 నుంచి 392 వరకు ఉన్న సుమారు అరవై ఎకరాలను కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తులకు 2012లో విక్రయించి ఆన్‌లైన్‌ చేశారు. తరువాత విషయం తెలుసుకున్న బాధితులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వీరభద్రాపురానికి చెందిన మేకల జయమ్మ స.హ.చట్టం ద్వారా వివరాలు సేకరించగా... అధికారులు ఇచ్చిన వివరాలు మరింత గందరగోళానికి దారి తీశాయి. 2001లోనే కృష్ణాజిల్లా వాసులకు పట్టాలిచ్చినట్లు... 2013లో ఆన్‌లైన్‌ చేసినట్లు... 1985లో డీకే రిజిస్టర్‌లో నమోదు చేసినట్లు... ఒకదానికొకటి పొంతన లేని వివరాలు ఇచ్చారు. ఈ వివాదం కొనసాగుతుండగానే... కొందరు దళారులు పల్నాడు జిల్లాకు చెందిన వ్యక్తులకు కట్టబెట్టేందుకు ఎకరాకు రూ.10 వేలు చొప్పున అడ్యాన్స్‌ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇలా రూ.కోటిన్నర వరకు వసూలు చేసి డ్యాక్యుమెంట్లు రాసిస్తున్నట్లు తెలిసింది. పూర్తి మొత్తం చెల్లిస్తే భూములు ఆన్‌లైన్‌ చేయిస్తామని చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజా రీసర్వే సైతం అన్యాక్రాంతం చేసుకున్న వారి పేరిటే చేస్తుండడం మరిన్ని వివాదాలకు తావిస్తోంది. ఈ విషయమై తహసీల్దారు జయలక్ష్మిని సంప్రదించగా... క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





