
మహారాష్ట్ర తరహా విధానంపై అధికారుల అధ్యయనం ఈనాడు, హైదరాబాద్‌: రోడ్లపై ట్రాఫిక్, కాలుష్య సమస్యలను పరిష్కరించడంలో భాగంగా కార్ల వినియోగాన్ని తగ్గించాలని రవాణాశాఖ భావిస్తోంది. జులై 31 నాటికి రాష్ట్రంలో కార్ల సంఖ్య 27.82 లక్షలకు చేరింది. ఇందులో ట్యాక్సీలుగా వినియోగించేవి 2 లక్షల వరకు ఉండగా.. వ్యక్తిగతంగా ఉపయోగించేవి 25 లక్షల దాకా ఉన్నాయి. హైదరాబాద్‌తోపాటు జాతీయ రహదారుల్లో ఎటుచూసినా కార్లే కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో అటు రద్దీ, ఇటు ప్రయాణ వ్యయాన్ని తగ్గించేలా ‘కార్‌ పూలింగ్‌’ విధానం రూపకల్పనపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. చాలా కార్లలో ఒక్కరే డ్రైవింగ్‌ చేసుకుంటూ వెళ్తుండగా మిగతా సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. దీనికి బదులుగా అదే మార్గంలో వెళ్లే ముగ్గురు లేదా నలుగురు కలిసి ఒకే కారులో ప్రయాణిస్తే రోడ్డుపై వాహనాల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. ఫలితంగా ట్రాఫిక్, ఇంధన వినియోగం, పార్కింగ్‌ ఇబ్బందులు తగ్గడంతోపాటు నలుగురూ కలిసి ప్రయాణ వ్యయాన్ని పంచుకోవడంతో ఖర్చు కూడా ఆదా చేసుకోవచ్చు. దీన్నే ‘కార్‌ పూలింగ్‌’ అంటారు. ఇప్పటికే ఇది కొన్ని ప్రైవేటు యాప్‌ల ద్వారా అందుబాటులో ఉండగా.. భద్రతా ఇతరత్రా సమస్యలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మహారాష్ట్ర ప్రభుత్వం యాప్‌ ఆధారిత కార్‌ పూలింగ్‌ విధానాన్ని చట్టబద్ధం చేసింది. అదే కోవలో తెలంగాణలోనూ పోలీస్, రవాణాశాఖల పరిధిలో ఈ విధానాన్ని తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కార్లలో ప్రయాణించే వారందరూ దీన్ని అవలంబించేలా ప్రత్యేక యాప్‌నూ రూపొందించే అవకాశం ఉంది. యాప్‌లో ఓ కారు యజమాని తాను వెళ్లే మార్గం వివరాల్ని నమోదు చేస్తే.. అదే దారిలో వెళ్లేవారు అతడిని సంప్రదించి కలిసిప్రయాణిస్తారు. భద్రత కోసం వారంతా ఎవరికి వారు తమ వివరాలు యాప్‌లో నమోదు చేస్తారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





