
హత్య కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్‌ వివరాలు వెల్లడిస్తున్న ఏఎస్పీ మహంతి కిషోర్‌కుమార్‌ మసీదుసెంటర్‌(కాకినాడ): వ్యక్తిని హత్య చేసిన ఘటనలో ఇద్దరిని కాకినాడ మూడో పట్టణ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆదివారం ఏఎస్పీ(అడ్మిన్‌) డా.మహంతి కిషోర్‌కుమార్,. సీఐ సత్యనారాయణ వివరాలు వెల్లడించారు. కాకినాడ సాంబమూర్తినగర్, ఇందిరాకాలనీకి చెందిన గండి గిరిధర్‌(40)కు వివాహమైంది. విభేదాలతో భార్యాభర్తలు విడిపోయారు. తండ్రి చనిపోవడంతో ప్రస్తుతం తల్లి జయలక్ష్మితో కలిసి ఉంటున్నారు. ఈ నెల 2న తెల్లవారుజామున గిరిధర్‌ హత్యకు గురయ్యారు. అతని తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. సాంకేతిక ఆధారాలతో విశ్లేషించి ఇందిరాకాలనీకి చెందిన పాలేపు వివేక్‌ అలియాస్‌ బన్నీ(18), అయోధ్యనగర్‌కు చెందిన ఏలూరి రామకృష్ణ(21)లను నిందితులుగా గుర్తించి శనివారం అరెస్ట్‌ చేశారు. గిరిధర్‌ తన సెల్‌ఫోన్‌లోని కొందరు మహిళల అసభ్యకర ఫొటోలు, వీడియోలను బన్నీ, రామకృష్ణలకు చూపించారు. మహిళల కుటుంబసభ్యులను బెదిరించి డబ్బులు సంపాదించాలనుకున్న వారిద్దరూ వాటిని ఇవ్వాలని గిరిధర్‌ను అడిగారు. ఘటన జరిగిన రోజు అతనింటికి వెళ్లి వీడియోలు, ఫొటోలు అడిగారు. మద్యం మత్తులో ఉన్న గిరిధర్‌ నిరాకరించడంతో ఘర్షణ జరిగింది. దాంతో వెంట తెచ్చిన కత్తితో పొడిచి గిరిధర్‌ను హత్య చేసి పరారయ్యారు. పోలీసులు వారిని అరెస్టు చేసి కత్తి, గిరిధర్‌ సెల్‌ఫోన్, పెన్‌డ్రైవ్, మరో నాలుగు ఫోన్లు, దుస్తులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్‌ చేసిన త్రీటౌన్‌ సీఐ సత్యనారాయణ, ఎస్సై చౌదరి, ఆంజనేయరాజు, హెచ్‌సీ సతీష్, కానిస్టేబుళ్లు మురళీరాజు, శ్రీనివాస్, క్రైం సిబ్బందిని ఎస్పీ బిందుమాధవ్‌ అభినందించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





