
మెక్సికోలోని సాల్టిల్లో వేదికగా ముగిసిన 'ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్ 2026'లో రికర్వ్ పురుషుల విభాగంలో చారిత్రాత్మక స్వర్ణ పతకం సాధించిన ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవరకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా ఆయన స్పందిస్తూ... ఈ విజయం భారత ఆర్చరీ చరిత్రలోనే ఒక నూతన అధ్యాయానికి నాంది పలికిందని కొనియాడారు. చిన్నతనంలోనే విజయవాడలో ఆర్చరీ ప్రయాణాన్ని ప్రారంభించి, స్వయంకృషి, క్రమశిక్షణతో అంతర్జాతీయ క్రీడా శిఖరాలను చేరుకున్న ధీరజ్ ప్రయాణం దేశంలోని కోట్లాది మంది యువతకు ప్రేరణగా నిలుస్తుందని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. అత్యంత ఒత్తిడితో కూడిన వాతావరణంలో జపాన్ క్రీడాకారుడు జున్యా నకానిషిపై షూట్-ఆఫ్‌లో సాధించిన ఈ విజయం, ధీరజ్ అద్భుతమైన సంయమనం, గురి తప్పని కచ్చితత్వానికి నిదర్శనమని అభినందించారు. ప్రపంచ కప్ ఫైనల్లో స్వర్ణం నెగ్గిన తొలి భారతీయ పురుష రికర్వ్ ఆర్చర్‌గా త్రివర్ణ పతాకాన్ని ప్రపంచ వేదికపై సగర్వంగా ఎగురవేసి, భారతావనికి గర్వకారణంగా నిలిచాడని కొనియాడారు.





