
ప్రతిచోటా జియో ట్యాగింగ్‌ సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి బండ్లగేరిలో కొలువైన భారీ గణనాథుడు మహబూబ్‌నగర్‌ నేరవిభాగం, న్యూస్‌టుడే: వినాయక చవితి వేడుకలు తొమ్మిది రోజులు జరగనున్నాయి. గణేశ నవరాత్రుల కోసం వేచి చూసిన యువత సందడి అంతాఇంతా కాదు. ఏకదంతుడిని స్వాగతిస్తూ ఆయా ప్రాంతాల్లో శుక్ర, శనివారాల్లో భారీ ఊరేగింపు నిర్వహించారు. మండపాల వద్ద భారీ సెట్టింగ్‌లు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా మండపాల నిర్వాహకులతో ఎస్పీ జానకి ఇప్పటికే సమీక్షించారు. ప్రతి మండపానికి అంతర్జాలంలో రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని సూచించగా 700 దరఖాస్తులు వచ్చాయి. వీటిని పరిశీలించి అనుమతులు ఇస్తున్నారు. ఆపై ప్రతి మండపాన్ని జియో ట్యాగింగ్‌ చేయనున్నారు. వాటిపై పూర్తి పర్యవేక్షణ, నిఘా ఉంచనుంది. ఇందుకోసం మండపాల నిర్వాహకులకు పోలీస్‌శాఖ పలు సూచనలు చేసింది. మండపాల సమీపంలో టపాకాయలు, ఇతర మందుగుండు సామగ్రిని ఉంచకూడదు. విగ్రహం గద్దె కింద ఎలాంటి వస్తువులు ఉండరాదు. మండపానికి మూడు వైపులా, పై కప్పును టార్పాలిన్‌ కవర్లతో కప్పాలి. నాణ్యమైన తీగతో విద్యుత్తు కనెక్షన్‌ ఇప్పించాలి. అత్యవసర దీపాన్ని అందుబాటులో ఉంచాలి. ఒక డ్రమ్ములో నీరు, రెండు బకెట్లలో ఇసుక ఉంచాలి. మండపాల వద్ద నిఘా నేత్రాలు ఏర్పాటు చేస్తే పోలీసు శాఖ పర్యవేక్షిస్తుంది. నిర్వాహకులు కూడా తమ చరవాణిలో ఏం జరుగుతుందో చూడవచ్చు. విగ్రహాల వద్ద తినుబండరాల కోసం రాత్రిపూట వరాహాలు, కుక్కలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మండపాల వద్ద ఎలాంటి ఘటనలు జరిగినా వెంటనే పోలీస్‌ అధికారులకు సమాచారం అందించాలి. డీఎస్పీ వెంకటేశ్వర్లు 87126 59310, మహబూబ్‌నగర్‌ వన్‌ టౌన్‌ సీఐ అప్పయ్య 87126 59311, రెండో పట్టణ సీఐ ఎజాజోద్దీన్‌ 87126 59312, రూరల్‌ సీఐ గాంధీనాయక్‌ 87126 59313 తదితరులకు ఫోన్‌ చేయవచ్చు. వాలంటీర్లకు ఫొటో గుర్తింపు కార్డులు గణేశ మండపాల వద్ద భద్రత కోసం నిర్వాహకులు ముగ్గురు వాలంటీర్లను 24 గంటల పాటు అందుబాటులో ఉంచాలి. మండపంవద్ద నిర్వహిం చే రికార్డులో వారి పేర్లు నమోదు చేయాలి. పోలీసులు మండపం వద్దకు వచ్చినప్పుడు వారికి ఫొటో గుర్తింపు కార్డులు ఇవ్వనున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





