
ఇంటర్నెట్ డెస్క్‌: కొన్ని రకాల యూపీఐ లావాదేవీలపై వ్యాపారుల నుంచి బ్యాంకులు, పేమెంట్‌ సర్వీసు ప్రొవైడర్లు రుసుములు వసూలు చేసేందుకు వెసులుబాటు కల్పించేలా కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్‌లో బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. దీంతో వినియోగదారుల్లో గందరగోళం నెలకొంది. ఏ లావాదేవీలపై ఛార్జీలు ఉంటాయి? వాటిని ఎవరు చెల్లించాలి? అనే దానిపై పూర్తి స్పష్టత లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది. రూ.2000 వరకు ఉండే యూపీఐ లావాదేవీల (UPI Payments)పై బ్యాంకులు/పేమెంట్‌ సర్వీసు ప్రొవైడర్లు ఛార్జీలు వసూలు చేయకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ (Finance Ministry) ఓ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎలక్ట్రానిక్‌ విధానంలో చేసే రూపే డెబిట్‌ కార్డు (RuPay Debit Card) చెల్లింపులకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని ఆర్థికశాఖ వెల్లడించింది. ఈ పరిమితులను అనుసరించి చేసే చెల్లింపులపై బ్యాంకులు, సర్వీసు ప్రొవైడర్లు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎలాంటి ఛార్జీలు వసూలు చేయొద్దని స్పష్టం చేసింది. అయితే, రూ.2వేల కంటే ఎక్కువ విలువ గల యూపీఐ ( UPI ) చెల్లింపులకు తక్షణమే వినియోగదారులు ఫీజులు చెల్లించాలని ఈ నోటిఫికేషన్‌ చెప్పట్లేదు. కానీ, ఆ దిశగా బ్యాంకులు ఛార్జీలు విధించేందుకు ఇప్పుడు మార్గం సుగమమైంది. ఇటీవల ‘పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్-2007’ సవరణ బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. దీని కింద అధిక విలువ గల యూపీఐ లావాదేవీలపై బ్యాంకులు, పేమెంట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు మర్చంట్‌ డిస్కౌంట్‌ రేటును (MDR Charges) వసూలు చేసేలా చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించే అవకాశం ఇప్పుడు లభించినట్లయ్యింది. అంటే, ఒకవేళ భవిష్యత్తులో ఈ ఫ్రేమ్‌వర్క్‌ అమల్లోకివస్తే.. రూ.2వేల కంటే ఎక్కువ మొత్తంలో చేసే యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉంటుంది. రూ.1.5 కోట్లకు పైగా వార్షిక టర్నోవర్‌ కలిగి ఉండే షాపింగ్‌ మాల్స్, కార్పొరేట్‌ సూపర్‌ మార్కెట్లు, లగ్జరీ హోటళ్ల వంటి వాటికి ఈ ఛార్జీలు విధించొచ్చని సమాచారం. పెద్ద వ్యాపార చెల్లింపులపై 0.3-0.5% వరకు ఎండీఆర్‌ విధించొచ్చని తెలుస్తోంది. అయితే, ఈ ఛార్జీల వల్ల సామాన్యులపై ఎలాంటి భారం పడబోదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. వ్యాపారులు ఆ భారాన్ని కస్టమర్లపైకి నెడతారేమోననే ఆందోళనలున్నాయి. వ్యాపారులు డిజిటల్ చెల్లింపుల నెట్‌వర్క్‌ను ఉపయోగించుకున్నందుకు బ్యాంకులు, పేమెంట్ ప్రాసెసర్లకు చెల్లించే రుసుమును మర్చంట్‌ డిస్కౌంట్‌ రేటుగా (MDR)గా వ్యవహరిస్తారు. ఇందులో మొత్తం నాలుగు రకాల ఫీజులు ఇమిడి ఉంటాయి. ఇంటర్‌ఛేంజ్‌ ఫీజు, ప్రాసెసింగ్ ఛార్జీలు, నెట్‌వర్క్‌ ఫీజు, ట్యాక్స్‌. లావాదేవీలు జరిపే కస్టమర్‌ బ్యాంకు/యాప్‌ వసూలు చేసే ఫీజును ఇంటర్‌ ఛేంజ్‌ ఫీజు అంటారు. రేజోర్‌పే, పేయూ, బిల్‌ డెస్క్‌ వంటి పేమెంట్‌ ప్రాసెసర్లు/ గేట్‌వేలకు చెల్లించేదాన్ని ప్రాసెసింగ్‌ ఫీజు అంటారు. వీసా, మాస్టర్‌ కార్డ్‌, ఎన్‌పీసీఐకి చెల్లించేవాటిని నెట్‌వర్క్‌ ఫీజు అంటారు. ఈ సేవలపై విధించే జీఎస్టీ ప్రభుత్వానికి వెళుతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి ఫోన్‌పే వాడి పేమెంట్‌ చేస్తే ఆ నగదు ఆ వ్యక్తి బ్యాంకు ఖాతాలో డెబిట్‌ ఆయ్యి, నెట్‌వర్క్‌ ద్వారా ప్రాసెస్‌ అయ్యి, మర్చంట్‌ బ్యాంక్‌లో క్రెడిట్‌ అవుతుంది. దీనికి గానూ వ్యాపారి పేమెంట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.



