

- యూపీఐ లావాదేవీలపై లేవు చార్జీలు
- రూ.2,000 వరకు ఉచిత చెల్లింపులు
- రూపే కార్డులకు కూడా వర్తింపు
UPI Charges: డిజిటల్ చెల్లింపులు జరిపే దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే తీపి కబురు చెప్పింది. చిన్న తరహా వ్యాపారులు, సామాన్య ప్రజలకు మరింత లబ్ధి చేకూర్చేలా ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగం సెప్టెంబర్ 14న ఒక కీలక గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి, చార్జీల భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
రూ. 2,000 వరకు ఎలాంటి చార్జీలు లేవు:
ఈ కొత్త నిబంధనల ప్రకారం యుపిఐ (UPI Charges) ద్వారా జరిపే రూ. 2,000 వరకు లావాదేవీలపై ఎలాంటి ట్రాన్సాక్షన్ చార్జీలు విధించకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులు కేవలం యుపిఐకే కాకుండా రూపే (RuPay) డెబిట్ కార్డ్ ద్వారా జరిపే చెల్లింపులకు కూడా వర్తిస్తాయి. బ్యాంకులు లేదా పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లు నేరుగా గానీ, ఇతర మార్గాల్లో గానీ ఈ పరిమితి లోపు జరిపే డిజిటల్ చెల్లింపులపై రుసుములను వసూలు చేయడానికి వీల్లేదు.
వినియోగదారులు, వ్యాపారులకు బిగ్ రిలీఫ్:
ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా కిరాణా షాపులు, వీధి వ్యాపారులు, చిన్న వ్యాపారులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. చెల్లింపులు జరిపే కస్టమర్‌తో పాటు, ఆ డబ్బును స్వీకరించే మర్చంట్‌పై కూడా ఎలాంటిదనపు భారం పడదు. ఉదాహరణకు, ఒక స్టోర్‌లో రూ. 800 యుపిఐ ద్వారా చెల్లిస్తే, కస్టమర్‌కు లేదా వ్యాపారికి ఎలాంటి చార్జీలు వర్తించవు. ఈ నిబంధన పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007 లోని సెక్షన్ 10A కింద అమలులోకి వచ్చింది.
రూ. 2,000 పైన లావాదేవీల పరిస్థితి ఏమిటి?
రూ. 2,000 దాటిన పెద్ద మొత్తాల లావాదేవీలపై చార్జీల విషయమై ఈ నోటిఫికేషన్లో ఎలాంటి రుసుములను పేర్కొనలేదు. అయితే సాధారణ పర్సన్-టు-పర్సన్ (P2P) లావాదేవీలు ఎప్పటికీ ఉచితంగానే ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) అమల్లోకి వచ్చినా, అది కేవలం నిర్దిష్ట పరిమితి దాటిన పెద్ద మర్చంట్ ట్రాన్సాక్షన్లకు మాత్రమే వర్తిస్తుందని, సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేసింది.