
ఇంటర్నెట్‌ డెస్క్‌: సామాజిక మాధ్యమాల్లో పిల్లల భద్రతకు సంబంధించిన అంశంలో ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ మెటా (Meta) కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారులపై లైంగిక వేధింపుల కంటెంట్‌ (Child Sexual Abuse Content)కు సంబంధించి నేరుగా భారత దర్యాప్తు సంస్థలకు రిపోర్ట్‌ చేసేందుకు అంగీకరించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వర్గాలు మంగళవారం వెల్లడించాయి. ఆన్‌లైన్‌ వేదికల్లో పిల్లల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోన్న కేంద్ర ప్రభుత్వం.. ఈ విషయంలో ఎలాంటి రాజీకి తావులేదని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు (Social Media Platforms) స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ‘‘చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కేసుల వివరాలు, ఇతరత్రా కంటెంట్‌ను దర్యాప్తు సంస్థలకు ఇచ్చేందుకు మెటా (Meta) అంగీకరించింది. పిల్లలకు సురక్షితమైన ఆన్‌లైన్ వాతావరణాన్ని కల్పించే దిశగా ఇది తొలి అడుగు మాత్రమే. ఇంకా చేయాల్సింది చాలా ఉంది’’ అని కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఈ సందర్భంగా స్పష్టం చేశాయి. సామాజిక మాధ్యమాల్లో హానికర కంటెంట్‌ నుంచి మైనర్లను రక్షించాల్సిన బాధ్యత సదరు ప్లాట్‌ఫామ్‌లదే అని కేంద్రం పునరుద్ఘాటించింది. దీన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ హానికర కంటెంట్‌ను కట్టడి చేసే విషయమై సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లతో కేంద్రం నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. అలాంటి కంటెంట్‌ను గుర్తించి, సామాజిక మాధ్యమాల నుంచి తొలగించేలా చర్యలు చేపట్టినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఇలాంటి కంటెంట్‌ విషయంలో భారత్‌లోని మెటా ప్రతినిధులకు కేంద్రం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మెటా ఉపయోగిస్తోన్న అల్గారిథమ్స్, కంటెంట్ నియంత్రణ వ్యవస్థలు, డీప్‌ఫేక్ కంటెంట్‌ను అరికట్టే ప్రక్రియలు, భారత చట్టాలకు అనుగుణంగా తీసుకుంటున్న చర్యల గురించి అధికారులు వివరాలు అడిగారు. ఈ నేపథ్యంలోనే మెటా తాజా నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటివరకు చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్‌ గురించి అమెరికాకు చెందిన ‘నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లాయిటెడ్ చిల్డ్రన్’ (ఎన్‌సీఎంఈసీ)కు మెటా నివేదిక ఇచ్చేది. ఆ సమాచారాన్ని ఎన్‌సీఎంఈసీ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దర్యాప్తు సంస్థలతో పంచుకునేది. అలా భారత దర్యాప్తు సంస్థలకు వివరాలు అందేవి. అయితే, ఇకపై ఇలాంటి సంస్థల ప్రమేయం లేకుండా.. నేరుగా మెటానే భారత దర్యాప్తు ఏజెన్సీలకు వివరాలను రిపోర్ట్‌ చేయనుంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.