
భాగ్యనగరంలో ఖైరతాబాద్ గణేశ్ తర్వాత బాలాపూర్ గణపయ్యకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ ఏడాది పూరీ జగన్నాథుడి ఆలయ నమూనాలో 18 అడుగుల గణనాథుడు భక్తులకు దర్శనమిస్తున్నా భాగ్యనగరంలో ఖైరతాబాద్ గణేశ్ తర్వాత బాలాపూర్ గణపయ్యకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ ఏడాది పూరీ జగన్నాథుడి ఆలయ నమూనాలో 18 అడుగుల గణనాథుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. బాలాపూర్ బొజ్జ గణపయ్య లడ్డూను పొందేందుకు భక్తులు భారీగా పోటీ పడే అవకాశం ఉందని నిర్వాహకులు భావిస్తున్నారు. బాలాపూర్ గణేశ్ ఉత్సవాలు వైభవంగా ప్రారంభమవుతున్నాయి. ప్రతి సంవత్సరం విభిన్న ఆలయ నమూనాలతో భక్తులను ఆకర్షించే విధంగా మండపాన్ని రూపొందిస్తున్నారు. ఈ ఏడాది పూరీ జగన్నాథ్ ఆలయ సెట్టింగ్‌ను ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసింది. 18 అడుగుల భారీ వినాయకుడు భక్తులకు కనువిందు చేస్తున్నాడు. భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 21 కిలోల పవిత్ర లడ్డూ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఉమా మహేశ్వరరావు కుటుంబం ప్రతి సంవత్సరం నిష్టగా ఒక రోజు ముందు 21 కిలోల లడ్డూను తయారు చేసి స్వామివారికి కానుకగా సమర్పిస్తోంది. బాలాపూర్ గణపయ్యతో పాటు లడ్డూ వేలం పాటకు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు ఉంది. లడ్డా వేలం తర్వాత భాగ్యనగరంలో నిమజ్జన ప్రక్రియ ప్రారంభం అవడం ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తుంది. 1994లో ప్రారంభమైన ఈ లడ్డూ వేలం ఎంతో మంది ప్రముఖులను ఆకర్షిస్తోంది. గతేడాది రూ.35 లక్షలు పలికిన ఈ లడ్డూ ఈసారి రూ.40 లక్షల వరకు పలుకుతుందని అంచనా. ఈ నెల 25 వరకు బాలాపూర్‌లో పండుగ సందడి కొనసాగనుంది. ప్రతిరోజూ ఉదయం 5 గంటలకే సుప్రభాత సేవ, రాత్రి విశేష హారతి భజన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. "ప్రతిసారి ఆలయ నమూనాను ఏర్పాటు చేస్తున్నాం. తిరుపతి, అరుణాచలం, గతేడాది స్వర్ణగిరి ఆలయం, అయోధ్య రామ మందిర ఆలయాల నమూనాలను వేయడం జరిగింది. ఈసారి ఒడిశాలోని పూరీ జగన్నాథుడి ఆలయ నమూనాను ఏర్పాటు చేశాం. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యూలైన్లు ఏర్పాటు చేశాం." -నిరంజన్ రెడ్డి, అధ్యక్షుడు, బాలాపూర్ ఉత్సవ కమిటీ





