
కోరుట్ల, సెప్టెంబర్ 16 : జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో బుధవారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంగన్వాడీ టీచర్లు నిరసన గళమెత్తారు. పట్టణంలోని కొత్త బస్టాండు వద్ద 63వ నంబర్ జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా, రాస్తారోకో చేశారు. కోరుట్లలో అంగన్వాడీ టీచర్ అన్నం లక్ష్మి హత్యకు ప్రభుత్వం బాధ్యత వహించాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. సర్ సర్వే పేరిట అంగన్వాడీ టీచర్లను బలి పశువులను చేస్తున్నారని మండి పడ్డారు. అంగన్వాడీ టీచర్లు ప్రభుత్వానికి అలుసై పోయారంటూ ధ్వజమెత్తారు. ఎస్ఐర్ సర్వే ప్రొగ్రాంలోఅంగన్వాడీలను భాగస్వాములను చేసి మా ప్రాణాలతో చెలగాటం అడుతున్నారని రోదించారు. కేవలం రూ. 13 వేల వేతనంతో పని చేస్తున్న అంగన్వాడీలను 18 గంటల పాటూ పనులు చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల జీతాలు తీసుకుంటున్న అధికారులు ఇంట్లో కూర్చొని అంగన్వాడీ టీచర్లను వేధింపులకు గురి చేస్తున్నారని అంగన్వాడీ టీచర్లు ఆరోపించారు. సర్ సర్వేతో రాత్రనకా, పగలనకా ఫోన్ చేస్తున్నారని దీంతో ఇంటిలో భార్యభర్తల మధ్య విభేదాలు పొడ చూపుతున్నాయని ఆవేదన చెందారు. కోరుట్లలో అంగన్వాడీ టీచర్ లక్ష్మీ హత్య జరగడానికి సర్ సర్వే ప్రధాన కారణమని చెప్పారు. మూడు నెలలుగా ఎస్ఐఆర్ ప్రోగ్రాంతో నానా నానా ఇబ్బందులు పడుతున్నామని, ఆనారోగ్యం భారిన పడుతున్నా పట్టించుకునే నాధుడే లేడని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు సర్ సర్వేను బహిష్కరిస్తామని హెచ్చరించారు. కోరుట్లలో హత్యకు గురైన అంగన్వాడీ టీచర్ లక్ష్మి కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా అదుకోవాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ అంగన్ వాడీ టీచర్స్ హెల్పర్స్ అసోసియోషన్ రాష్ట్ర అధ్యక్షురాలు సాయిశ్వరీ, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సుతార రాములు, జిల్లా అధ్యక్షుడు ఏశవేణి గణేష్, ఉపాధ్యక్షుడు మునుగూరి హన్మంతు, నాయకులు దేవదాస్, రామిళ్ల రాంబాబు, ఉస్మాన్, పిట్టల నారాయణ, కోరుట్ల డివిజన్ లోని అంగన్వాడీ టీచర్లు ఆయాలు పాల్గొన్నారు.





