
కాళీకృష్ణ శ్రీనివాస్ అలియాస్ ఆళ్ల నాని ఇకలేరు. గుండెపోటుతో ఆయన మృతి చెందారు. విశాఖ సీతమ్మధార ప్రాంతంలోని తన ఇంట్లోనే ఆళ్ల నాని గుండెపోటుకు గురై కుప్పకూలారు. కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి.. ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినా ఆయన అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు. 57 ఏళ్ల ఆళ్ల నాని.. ఏలూరు నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2004, 2009, 2019 ఎన్నికల్లో ఆయన గెలిచారు. 2017లో ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆళ్ల నానికి ఇద్దరు కుమారులు ఉండగా.. ఒకరు యూఎస్, మరొకరు యూకేలో ఉంటున్నారు. మొదట కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆళ్ల నాని.. 2004, 2009 ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత వైఎస్సార్సీపీ ఆవిర్భావ సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట నడిచారు. అనంతరం 2019 ఎన్నికల్లో మరోసారి గెలిచి.. వైఎస్ జగన్ కేబినెట్లో ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. కరోనా మహమ్మారి సమయంలో వైద్యారోగ్య శాఖ మంత్రిగా సమర్థవంతంగా పనిచేశారు. ఏలూరు నియోజకవర్గం నుంచి 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆళ్ల నాని.. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరఫున గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారు. 2014 ఎన్నికల్లో ఏలూరు నుంచి వైసీపీ తరఫున పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి పాలైన తర్వాత.. ఆళ్ల నాని వైసీపీ నుంచి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత గతేడాది ఫిబ్రవరిలో టీడీపీలో చేరారు.





