

- ఏపీలో ఉద్యోగాల వయోపరిమితి పెంపు
- 44 ఏళ్లకు ఏజ్ లిమిట్
- 2027 వరకు జీవో అమలు
AP Government: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగార్థులకు అద్భుతమైన శుభవార్త అందించింది. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వయోపరిమితి సడలింపు ప్రతిపాదనపై కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీపీఎస్సీ (APPSC) తో పాటు వివిధ నియామక సంస్థల ద్వారా చేపటే నాన్-యూనిఫాం ప్రభుత్వ ఉద్యోగాల ప్రత్యక్ష నియామకాలకు గరిష్ట వయోపరిమితిని గణనీయంగా పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
10 ఏళ్ల సడలింపు.. భారీ ఊరట:
ఇప్పటివరకు నాన్-యూనిఫాం పోస్టుల భర్తీకి గరిష్ట వయోపరిమితి 34 ఏళ్లుగా ఉండగా, దానిని ఏకంగా 44 ఏళ్లకు పెంచారు. ఈ 10 సంవత్సరాల అదనపు వయోపరిమితి సడలింపు 2027 సెప్టెంబర్ 30 వరకు వెలువడే నోటిఫికేషన్లకు అమల్లో ఉంటుంది. దీనికి అదనంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు ప్రస్తుతం అమలులో ఉన్న రిజర్వేషన్ సడలింపులు యథావిధిగా వర్తిస్తాయి.
ఆ ఉద్యోగాలకు మినహాయింపు:
అయితే ఈ ప్రత్యేక వయోపరిమితి పెంపు అన్ని ఉద్యోగాలకు వర్తించదని ప్రభుత్వం(AP Government) స్పష్టం చేసింది. పోలీస్, ఎక్సైజ్, ఫైర్, జైళ్లు, అటవీ, రవాణా శాఖలకు చెందిన యూనిఫాం పోస్టులకు, భౌతిక ప్రమాణాలు తప్పనిసరి అయిన ఉద్యోగాలకు ఈ సడలింపు వర్తించదు. ఆయా ఉద్యోగ ప్రకటనల్లో పేర్కొనే నిబంధనలను అభ్యర్థులు పరిశీలించాల్సి ఉంటుంది.