
అధికారాలు పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఈనాడు, అమరావతి: నివాస ధ్రువీకరణపత్రాల జారీ అధికారాన్ని తహసీల్దార్లకు పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ పత్రం కావాలంటే ఆధారాలతో దరఖాస్తుల్ని తహసీల్దారుకు సమర్పించాలని, ఎలాంటి ఆధారాలు లేకపోతే తహసీల్దారు స్థానికంగా విచారణ చేసి నివాసాన్ని ధ్రువీకరించి పత్రం జారీచేయాలని సీఎస్, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆధార్, రేషన్‌ కార్డులను నివాస రుజువులుగా ఉపయోగించాలని ప్రభుత్వం 2015 జూన్‌ 20న ఉత్తర్వులు ఇచ్చింది. తహసీల్దార్ల ద్వారా నివాస ధ్రువీకరణపత్రాల జారీని నిలిపేసింది. అయితే ఆదివాసీ గిరిజనుల్లో(పీవీటీజీ) కొన్ని కుటుంబాలకు ఆధార్‌ నమోదు, అప్‌డేషన్‌ కోసం.. గుర్తింపు రుజువుగా డిజిటల్‌ సంతకం, క్యూఆర్‌ కోడ్‌తో కూడిన నివాస ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు (ఎస్‌జీఎస్‌డబ్ల్యు) శాఖ ప్రభుత్వాన్ని కోరింది. విద్య, ఉద్యోగాలు, ఓటరు జాబితాలో పేరు నమోదుకు స్థానిక గుర్తింపు కోసం ప్రజలు నివాస ధ్రువీకరణ పత్రాల్ని కోరుతున్నారు. దీన్ని పరిశీలించిన ప్రభుత్వం 2015 జూన్‌ 20న ఇచ్చిన జీవోను రద్దుచేసింది. తహసీల్దార్ల ద్వారా నివాస ధ్రువీకరణ పత్రాల జారీని పునరుద్ధరించింది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





