
Rain : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడేందుకు అనువైన పరిస్థితులు కనిపిస్తున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శనివారం అంటే ఈ నెల 19 సాయంత్రానికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ అల్పపీడనం రాబోయే మూన్నాలుగు రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడనుందని అధికారులు తెలిపారు. అనంతరం ఇది దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలవైపు పయనించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీని కదలికలను నిరంతరం గమనిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అల్పపీడనం ప్రభావంతో వచ్చే వారంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టంచేసింది. వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లే ముందు వాతావరణ హెచ్చరికలను తప్పనిసరిగా గమనించాలని అధికారులు కోరారు.





