
పెద్దశంకరంపేట: వెనుకబాటుకు గురైన ‘లోద’ సామాజిక వర్గానికి బీసీ జాబితాలో చోటు కల్పించి, న్యాయం జరిగేలా కమిషన్ చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్ అన్నారు. బీసీ జాబితాలో తమను చేర్చాలని ‘లోద’ కులస్థులు గతంలో ఇచ్చిన వినతి మేరకు వారి స్థితిగతులను తెలుసుకునేందుకు కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, డాక్టర్ బాలలక్ష్మీతోపాటు ఆయన బుధవారం సాయంత్రం పెద్దశంకరంపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడి జీవన విధానం, వెనుకబాటుకు గల కారణాలపై ఆరా తీశారు. విద్య, ఉపాధి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, రిజర్వేషన్లు, వృత్తిపరమైన అవకాశాలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలు సేకరించడం ద్వారా వాస్తవ పరిస్థితులు తెలుసుకునే అవకాశం ఉందన్నారు. లోద సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి సామాజిక, ఆర్థిక పరిస్థితులు, విద్య, ఉపాధి అవకాశాలను సమగ్రంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. వారి వెంట మెదక్ ఆర్డీఓ రమాదేవి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఉపేందర్, తహసీల్దార్ నారాయణ, ఎంపీడీవో క్రాంతి కుమార్, సర్పంచి జంగం రేణుక తదితరులు ఉన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





