
నాలుగు జిల్లాల తలరాతలు మార్చే ప్రాజెక్టు వెలిగొండ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కృష్ణా నదీ జలాలు ఈ ప్రాంతానికి వస్తాయని ఎవరూ ఆలోచన చేసి ఉండరని తెలిపారు. మార్కాపురం, జూన్ 27: నాలుగు జిల్లాల తలరాతలు మార్చే ప్రాజెక్టు వెలిగొండ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈరోజు(శనివారం) దోర్నాల మండలం గంటావానిపల్లిలో వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులు, రైతులతో సీఎం సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. నీళ్లు లేక చాలా మంది ఫ్లోరైడ్ వాటర్ తాగుతున్నారని.. కృష్ణా నదీ జలాలు ఈ ప్రాంతానికి వస్తాయని ఎవరూ ఆలోచన చేసి ఉండరని తెలిపారు. రాయలసీమ, మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు తీసుకురావాలని ఎన్టీఆర్ ఆలోచన చేశారని గుర్తుచేశారు.1996 మార్చి 26న వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించామని.. రూ.900 కోట్లు పునరావాసం కోసం కేటాయించామని అన్నారు. రూ.300 కోట్లు మొదటి విడతలో నిర్వాసితులకు ఇస్తున్నామని చెప్పారు. ఏపీలో చాలా ఇబ్బందులు ఉన్నాయని సీఎం అన్నారు. నక్సలిజంపై పోరాటం చేశానని.. క్లైమోర్ బాంబులు పెడితే వేంకటేశ్వరస్వామి తనను కాపాడారన్నారు. గత పాలకులు రూ.10 లక్షల కోట్లు అప్పులు పెట్టిపోయారని విమర్శించారు. 3,351 వెలిగొండ నిర్వాసిత కుటుంబాలకు రూ.300 కోట్లు జమ చేశామన్నారు. నిర్వాసితుల త్యాగం వృథా కాదని.. అందరికంటే మెరుగైన జీవితం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. వెలిగొండ ప్రాజెక్టుపై ఈ టర్మ్‌లో రూ.3,900 కోట్ల వ్యయం అవుతోందన్నారు. 2027 నాటికి మిగిలిన పనులన్నీ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఫేజ్-1, ఫేజ్-2 పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇడుపూరు, గోగులదిన్నే, తోకపల్లి తదితర పునరావాస కాలనీల్లో మౌలిక వసతులు పూర్తి చేశామన్నారు. మార్కాపురానికి ప్రత్యేక జిల్లా ఇచ్చామని.. కలెక్టరేట్ కూడా పునరావాస కాలనీ పక్కనే వస్తుందని తెలిపారు. పునరావాస కాలనీ భవిష్యత్తులో ఆదర్శ టౌన్‌షిప్‌గా అభివృద్ధి చెందుతుందని అన్నారు. 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు.. 23 లక్షల మందికి తాగునీరు అందేలా వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని సీఎం తెలిపారు