
Telangana : సుదీర్ఘ వేసవి విరామానికి తెరపడింది. సరికొత్త ఆశలు, ఆశయాలతో తెలంగాణ వ్యాప్తంగా సోమవారం (జూన్ 15) నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. దాదాపు 50 రోజుల పాటు సెలవుల మజాను ఆస్వాదించిన విద్యార్థులు.. మళ్లీ పుస్తకాల సంచులు సర్దుకుని క్లాస్‌రూమ్‌ల వైపు అడుగులు వేయనున్నారు. విద్యార్థుల రాకతో ఇన్నాళ్లూ నిశ్శబ్దంగా ఉన్న స్కూల్ ఆవరణలన్నీ మళ్లీ పిల్లల సందడితో కోలాహలంగా మారనున్నాయి. కొత్త విద్యా సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాలు ఇప్పటికే తరగతి గదులను శుభ్రం చేయించి సర్వం సిద్ధం చేశాయి. రాష్ట్రంలో దాదాపు 26,000 కు పైగా ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలతో పాటు వేలాది ప్రైవేట్ విద్యాసంస్థలు సోమవారం నుంచి ఒకేసారి తెరుచుకోనున్నాయి. ఈ స్కూళ్లలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు సుమారు 1.10 లక్షల మందికి పైగా ఉపాధ్యాయులు, విద్యా సిబ్బంది తమ విధులకు హాజరు కానున్నారు. నిజానికి జూన్ 12నే స్కూళ్లు తెరుచుకోవాల్సి ఉన్నప్పటికీ, ఎండల తీవ్రత దృష్ట్యా అధికారులు జూన్ 15కి వాయిదా వేశారు. ఈ మూడు రోజుల పనిదినాల నష్టాన్ని భర్తీ చేసేందుకు జూలై 11న వచ్చే రెండో శనివారం నాడు పాఠశాలలను యథావిధిగా నడపాలని విద్యాశాఖ నిర్ణయించింది. పాఠశాల విద్యాశాఖ రూపొందించిన నూతన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది మొత్తం 227 పనిదినాలు ఉంటాయి. దీని ప్రకారం జూలై 31 లోపు ఫార్మేటివ్ అసెస్‌మెంట్ (FA-1), సెప్టెంబర్ 21 నాటికి FA-2, అక్టోబర్ 1 నుంచి 9 వరకు సమ్మేటివ్ అసెస్‌మెంట్ (SA-1) పరీక్షలు నిర్వహిస్తారు. ఇక పండుగ సెలవుల విషయానికి వస్తే, అక్టోబర్ 10 నుండి 22 వరకు దసరా సెలవులు, డిసెంబర్ 23 నుండి 27 వరకు క్రిస్మస్ సెలవులు (మిషనరీ స్కూళ్లకు), అలాగే 2027 జనవరి 13 నుండి 17 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయి. ఈ పూర్తి విద్యా సంవత్సరం