
Telangana : సుదీర్ఘ వేసవి విరామానికి తెరపడింది. సరికొత్త ఆశలు, ఆశయాలతో తెలంగాణ వ్యాప్తంగా సోమవారం (జూన్ 15) నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. దాదాపు 50 రోజుల పాటు సెలవుల మజాను ఆస్వాదించిన విద్యార్థులు.. మళ్లీ పుస్తకాల సంచులు సర్దుకుని క్లాస్‌రూమ్‌ల వైపు అడుగులు వేయనున్నారు. విద్యార్థుల రాకతో ఇన్నాళ్లూ నిశ్శబ్దంగా ఉన్న స్కూల్ ఆవరణలన్నీ మళ్లీ పిల్లల సందడితో కోలాహలంగా మారనున్నాయి. కొత్త విద్యా సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాలు ఇప్పటికే తరగతి గదులను శుభ్రం చేయించి సర్వం సిద్ధం చేశాయి. రాష్ట్రంలో దాదాపు 26,000 కు పైగా ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలతో పాటు వేలాది ప్రైవేట్ విద్యాసంస్థలు సోమవారం నుంచి ఒకేసారి తెరుచుకోనున్నాయి. ఈ స్కూళ్లలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు సుమారు 1.10 లక్షల మందికి పైగా ఉపాధ్యాయులు, విద్యా సిబ్బంది తమ విధులకు హాజరు కానున్నారు. నిజానికి జూన్ 12నే స్కూళ్లు తెరుచుకోవాల్సి ఉన్నప్పటికీ, ఎండల తీవ్రత దృష్ట్యా అధికారులు జూన్ 15కి వాయిదా వేశారు. ఈ మూడు రోజుల పనిదినాల నష్టాన్ని భర్తీ చేసేందుకు జూలై 11న వచ్చే రెండో శనివారం నాడు పాఠశాలలను యథావిధిగా నడపాలని విద్యాశాఖ నిర్ణయించింది. పాఠశాల విద్యాశాఖ రూపొందించిన నూతన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది మొత్తం 227 పనిదినాలు ఉంటాయి. దీని ప్రకారం జూలై 31 లోపు ఫార్మేటివ్ అసెస్మెంట్ (FA-1), సెప్టెంబర్ 21 నాటికి FA-2, అక్టోబర్ 1 నుంచి 9 వరకు సమ్మేటివ్ అసెస్మెంట్ (SA-1) పరీక్షలు నిర్వహిస్తారు. ఇక పండుగ సెలవుల విషయానికి వస్తే, అక్టోబర్ 10 నుండి 22 వరకు దసరా సెలవులు, డిసెంబర్ 23 నుండి 27 వరకు క్రిస్మస్ సెలవులు (మిషనరీ స్కూళ్లకు), అలాగే 2027 జనవరి 13 నుండి 17 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయి. ఈ పూర్తి విద్యా సంవత్సరం
2027 ఏప్రిల్ 23తో ముగుస్తుంది, ఆ మరుసటి రోజు నుంచే విద్యార్థులకు మళ్లీ వేసవి సెలవులు ప్రారంభమవుతాయి.
ప్రభుత్వ స్కూళ్లలో చదివే పేద విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా స్కూల్ తెరిచిన మొదటి రోజే ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌ల పంపిణీ పూర్తి చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. దీనితో పాటు విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపరచడం, బడికి వచ్చేలా ప్రోత్సహించే లక్ష్యంతో 'సీఎం బ్రేక్‌ఫాస్ట్' పథకాన్ని, రాగిజావ పంపిణీని కూడా ఈసారి పకడ్బందీగా అమలు చేయనున్నారు. కొత్త క్లాసులు, సరికొత్త పాఠాలతో ప్రారంభం కానున్న ఈ విద్యా ప్రయాణం కోసం అటు విద్యార్థులు, ఇటు ఉపాధ్యాయులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.