
Pawan Kalyan | ఇంటర్నెట్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బుధవారం హనుమకొండలో పర్యటించారు. జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న నిరంజన్(17) అనే బాలుడు తనకు అభిమాని అని, తనను కలవాలన్న అతడి ఆకాంక్షను తెలుసుకున్న పవన్.. ఈ ఉదయం నేరుగా బాలుడి నివాసానికి వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. తన పర్యటనకు సంబంధించిన ఫొటోలతో ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. ‘‘కొద్ది రోజుల క్రితం వరంగల్ జిల్లా హనుమకొండకు చెందిన నిరంజన్ అనే బాలుడు అరుదైన వ్యాధితో పోరాడుతూ నన్ను కలవాలనే ఆకాంక్షను వ్యక్తం చేసిన వీడియోను చూశాను. నిరంజన్ ఆకాంక్షను నెరవేర్చాలని భావించాను. ఈరోజు హనుమకొండలోని అతని నివాసానికి వెళ్లి పరామర్శించాను. అరుదైన వ్యాధితో చేస్తున్న పోరాటంలో అతడి అసాధారణ ధైర్యం, ఆత్మవిశ్వాసం, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న తీరు స్ఫూర్తిదాయకం. తీవ్రమైన అనారోగ్య సమస్యల మధ్య నిరంజన్ చూపుతున్న మనోధైర్యం ప్రశంసనీయం. నిరంజన్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని ప్రార్థించాను. భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు అతనిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. భగవంతుని ఆశీస్సులతో నిరంజన్ త్వరగా కోలుకోవాలి. ప్రియమైన నిరంజన్.. నీ ధైర్యం నీ కష్టాలకంటే గొప్పది. త్వరలో నిన్ను సంపూర్ణ ఆరోగ్యంతో, చిరునవ్వుతో, మరింత ఉత్సాహంగా చూడాలని కోరుకుంటున్నాను. అదే సమయంలో వరంగల్, హనుమకొండ పర్యటనకు పూర్తి సహాయ సహకారాలు అందించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖకు కృతజ్ఞతలు. తెలంగాణ ప్రజలు నాపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయత, అభిమానానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదాలు, ప్రేమ నాకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయి. నాపై మీ మమకారాన్ని జీవితాంతం నా హృదయాంతరాల్లో నిలుపుకొంటాను’’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిరంజన్ ఓ కుక్క పిల్ల బొమ్మ చూపించి దాన్ని పెంచుకోవాలని ఉందని చెప్పగా, కొని పంపుతానని పవన్ హామీ ఇచ్చారు. కుక్కను పెంచుకోవడానికి