
సలార్ పార్ట్ 1 సీజ్‌ఫైర్, మిరాయ్, మ్యూజిక్ స్కూల్, గుడ్ బ్యాడ్ అగ్లీ, మట్కా.. మొదలైన సినిమాలతో బాల నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు ‘కార్తికేయ్ దేవ్.’ ‘పిల్లల ఆసక్తిని గమనించి, తగిన సూచనలతో గైడ్ చేయడం వరకే ఈ తరాన్ని పెంచడం అంటే’ అని వివరించారు కార్తికేయ దేవ్ తల్లి కవిత పొదిలపు, తండ్రి గద్దె నారాయణరావు. సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్న ఈ తల్లిదండ్రులు తమ కూతురు పునర్విక, కొడుకు కార్తికేయదేవ్ పెంపకం గురించి పంచుకున్న విశేషాలు... ‘‘మేమిద్దరం సాఫ్ట్‌వేర్ ఉద్యోగులమే. పిల్లలు కూడా సాఫ్ట్‌వేర్ రంగంలోనే ఉండాలని అనుకోవడంలేదు. బాబుకు ఊహ తెలిసినప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టముండేది. ఎవరైనా ‘పెద్దయ్యాక ఏం అవుతావు?’ అని అడిగితే, ‘హీరో అవుతా’ అనేవాడు. టీవీ ముందు నిలుచొని, ‘అమ్మా, టీవీ లోపలికి వెళ్తా...’ అనేవాడు. చదువులో కూడా ముందుండేవాడు. కొన్ని రోజులు ఆలోచించాను. ‘బాబు యాక్టింగ్ అంటే ఆసక్తి చూపుతున్నాడు, ఒకసారి ప్రయత్నిద్దాం’ అని ఇంటర్నెట్‌లో వెతికి ఒక మోడలింగ్ స్కూల్లో చేర్పించాం. డిస్టెన్స్ వద్దని చెబుతాను.. మొదట ఒకట్రెండు యాడ్ ఫిల్మ్స్‌లో యాక్ట్ చేశాడు. ఆ సమయంలోనే చిన్న చిన్న సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అప్పుడు ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు. ఒక రోజు ఇంట్లో అందరం కూర్చొని ఈ విషయమ్మీద చర్చపెట్టుకున్నాం. ‘‘మనకు ఇండస్ట్రీలో ఎవరూ లేరు. అక్కడ పెద్ద పోరాటమే చేయాల్సి ఉంటుంది. సినిమాలు హిట్, ప్లాపులుంటాయి. ఎక్కడైనా డౌన్ అయితే డిప్రెస్ అయ్యే సందర్భాలూ ఉంటాయి. మేం ఎప్పుడూ నీ వెంటే ఉండకపోవచ్చు. బ్యాలెన్స్ చేసుకోకపోతే చాలా కష్టపడాల్సి వస్తుంది. చదువుపైన ఎంత ఫోకస్ పెడితే అంత ప్రోత్సహిస్తాం’’ అని చెప్పాం. బాబు మాత్రం ‘సినిమాయే నా కెరీర్’ అన్నాడు. దీంతో బాబుకి ఇష్టమైన కెరీర్‌వైపే అడుగులు వేయడం మంచిదనుకున్నాం. ఇష్టమైన వాటికోసం పరుగులు తీస్తూ, చదువుని నిర్లక్ష్యం చేయకూడదని, ‘డిగ్రీ తప్పనిసరిగా ఉండాల’ని చెప్పాను. అందుకు ‘సరే’ అన్నాడు