
బీసీలకూ ‘పీఎం సూర్యఘర్‌’ అమలుకు సన్నాహాలు గురుద్వారా, న్యూస్‌టుడే: విద్యుత్తు బిల్లుల భారం తగ్గించడంతో పాటు ప్రతి ఇంటిని సౌర విద్యుత్తు ఉత్పత్తి కేంద్రంగా మార్చే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా ‘ప్రధానమంత్రి సూర్య ఘర్‌’ పథకాన్ని బీసీ కుటుంబాలకు సైతం వర్తింపజేసేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. ఎస్సీ, ఎస్టీలకు అందిస్తున్న మాదిరిగానే బీసీలకు సైతం అదనపు ప్రయోజనం చేకూరేలా కూటమి సర్కారు ముందడుగు వేసింది. 200 యూనిట్లలోపు విద్యుత్తు వినియోగించే బీసీలకు సౌరవిద్యుత్తు పథకాన్ని వర్తింపజేయనున్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ కనెక్షన్‌ అందించేలా ప్రణాళిక రూపొందించారు. లబ్ధిదారులకు రూ.20 వేలు చొప్పున అదనపు రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అవసరమైన వారికి బ్యాంకు రుణ సదుపాయాన్ని సైతం అందించనున్నట్లు అధికారులు తెలిపారు. కొన సాగుతున్న సర్వే..: జిల్లా వ్యాప్తంగా 10,37,940 విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్తు వినియోగిస్తున్న బీసీ కుటుంబాల వివరాలను విద్యుత్తు సిబ్బంది సేకరిస్తున్నారు. రాయితీ ఉంటుందిలా..: ఒక్కో ఇంటికి రెండు కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్తు యూనిట్‌ ఏర్పాటు చేస్తారు. దీనికి రూ.1.30 లక్షల వరకు ఖర్చవుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.80 వేలు రాయితీ ఇస్తాయి. మిగతా రూ.50 వేలు ఏపీఈపీడీసీఎల్‌ బ్యాంకు రుణంగా ఇప్పిస్తుంది. ఏడేళ్ల వరకు ఈఎంఐ..: ఇంటి పైకప్పుపై కనీసం 200 చదరపు అడుగుల స్థలం ఉన్న బీసీలు సౌర విద్యుత్తు పలకలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంటిపై యూనిట్ ఏర్పాటు చేశాక రుణంగా పొందిన మొత్తాన్ని సదరు లబ్ధిదారు ఏడేళ్ల పాటు ఈఎంఐ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు బిల్లు ఇస్తారు. ఈ పథకానికి అర్హుల నుంచి ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





