
న్యూస్‌టుడే, రామాయంపేట (చేగుంట) సర్కారు దవాఖానాల్లో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రధానంగా వైద్యుల నియామకంపై దృష్టిసారించింది. వీళ్లు లేకపోతే ఇక్కడికొచ్చే రోగులు ప్రైవేటు బాట పడుతుంటారు. దీన్ని అధిగమించేందుకు ఇటీవల వైద్యులను నియమించడం గమనార్హం. రామాయంపేటలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో తాజాగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసింది. వారం కిందట వైద్యుల రాకతో సేవలు మెరుగుపడుతున్నాయి. రామాయంపేట సీహెచ్‌సీ స్థాయి పెరిగినా కూడా వైద్యుల నియామకం చేపట్టలేదు. నాలుగేళ్ల క్రితం అప్పటి భారాస ప్రభుత్వ హయాంలో వైద్యవిధాన పరిషత్‌ కిందికి మారింది. అయితే వైద్యులు, ఇతర సిబ్బంది నియమించలేదు. అవసరమైన పరికరాలను మంజూరు చేయలేదు. దీంతో రోగులకు ఇబ్బందులు తప్పలేదు. ఎట్టకేలకు ప్రభుత్వం ఆసుపత్రిలో సమస్యల పరిష్కారానికి అడుగేసింది. కొత్తగా జనరల్‌ సర్జన్, జనరల్‌ మెడిసిన్, చిన్నపిల్లల వైద్యులు, ఇద్దరు మత్తు డాక్టర్లను ఇక్కడ నియమించింది. వారంతా విధుల్లో సైతం చేరారు. వారంలో గైనకాలజిస్టులు సైతం చేరనున్నారు. ప్రస్తుతం దంత వైద్యుడు కూడా ఉన్నారు. అవసరమైన సిబ్బంది కూడా ఉండటం వల్ల రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం రోజుకు 300 మంది వరకు వస్తున్నారు. మొన్నటివరకు వంద మంది కూడా దాటలేదు. ఆసుపత్రిలో కాన్పులు, శస్త్రచికిత్సలు చేయడానికి అవసరమైన యంత్రాల కొనుగోలుకు ప్రభుత్వం రూ.50 లక్షలు మంజూరు చేసింది. ఇందులో రూ.14.77 లక్షలతో ఆల్ట్రాసౌండ్, రూ.13.15 లక్షలతో రేడియాగ్రఫీ, రూ.3.15 లక్షలతో ఐసీయూకి సంబంధించిన పారామానిటర్లు, మిగతా వాటితో పలు రకాల పరికరాలు సమకూర్చారు. ఎక్స్‌రే తీసిన వెంటనే చరవాణికి సమాచారం వచ్చేలా ఆధునికీకరిస్తున్నారు. మరో 10 రోజుల్లో సేవలు అందుబాటులోకి రానుంది. ఎంపీ రఘునందన్‌రావు కృషితో డెంటల్‌ కుర్చీ సైతం వచ్చింది. నిపుణులైన వైద్యులు రావడంతో రోగులకు మేలు చేకూరనుంది. అవసరమైన పరికరాలు సైతం సమకూరాయి. త్వరలో మరికొన్ని రానున్నాయి. త్వరలోనే ప్రసవాలనూ సైతం ప్రారంభించనున్నాం. ప్రైవేటుకు దీటుగా సేవలు అందించడమే మా లక్ష్యం. డాక్టర్‌ లింబాద్రి, ఆసుపత్రి పర్యవేక్షకుడు .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





